తెలంగాణలో కొద్ది రోజుల క్రితం సంచలనం రేపిన దేవరయాంజాల్ భూముల విషయంలో ఏర్పాటైన కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నిన్ననే (నవంబరు 16) ఈ నివేదికను కమిటీ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినవిగా కమిటీ తేల్చింది. హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలో దేవరయాంజాల్ ప్రాంతం ఉంది. అక్కడ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కూడా ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఓ కమిటీని నియమించింది. ఇక్కడ ఉన్న 1,350 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందినవేనని కమిటీ చెప్పినట్లు తెలుస్తోంది.


ఆ కమిటీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు నేతృత్వం వహించారు. అందులో నల్గొండ, మేడ్చల్‌ మల్కాజ్ గిరి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. వీరితో ప్రత్యేకంగా ప్రభుత్వం దేవరయాంజాల్ భూముల విచారణ కోసం కమిటీని నియమించింది. విచారణలో భాగంగా గతేడాది మే నెలలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. దేవరయాంజాల్ భూముల విషయంలో ఇప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రమేయంపై విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు విచారణ చేశారు.


ప్రత్యేక బృందాలు వేర్వేరుగా విచారణ చేపట్టాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూ ఆక్రమణలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను వివిధ శాఖల పరిశీలనకు పంపనున్నారు. ఆలయ భూముల సర్వే నంబర్లు, ఇతర శాఖల పరిధిలో ఉన్న విస్తీర్ణాలతోపాటు ఆక్రమణలు జరిగిన వ్యవహారంపైన కూడా ఆయా శాఖలు సమగ్ర పరిశీలన చేయించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దస్త్రాన్ని న్యాయ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.


అసలేం జరిగిందంటే..  
ఏడాదిన్నర క్రితం దేవరయాంజాల్ భూముల వివాదం రేగింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూములను ఆక్రమించి గోదాములు నిర్మించుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కొందరు స్థానికులు, గోదాముల నిర్వహకులు తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.


కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి 1925లో నిజాం హాయాంలో రాముడి భక్తుడైన రామిడి పుల్లయ్య అనే వ్యక్తి గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి. నిజాం నవాబు వద్ద రామిడి పుల్లయ్య పని చేసేవారు. ఈ భూములు ఈటల రాజేందర్‌ కనుసన్నల్లోనే కబ్జాకు గురైనట్టుగా దేవరయాంజాల్‌ గ్రామస్తులు గతంలోనే విచారణ కమిటీకి తెలిపారు. రికార్డుల ప్రకారం ఆలయానికి 1,521.13 ఎకరాల భూములున్నాయి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ధూపదీప నైవేద్యాలకు వినియోగించాల్సి ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిర్మించినట్లు చెబుతున్న గోదాములతో పాటు అక్కడ ఉన్న ఇతర గోదాములు, కట్టడాలను కమిటీ పరిశీలించింది. భూముల్లో 219 వరకు ప్రైవేటు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 


ఈ సందర్భంగా కొందరు స్థానికులు, గోదాముల నిర్వాహకులు తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాలను అధికారులకు సమర్పించారు. భూములను సేల్‌ డీడ్‌తో కొనుగోలు చేశామని వివరణ ఇచ్చారు. ఈటల రాజేందర్‌తో ముడిపెట్టి ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. గతేడాది మే నెల 7న ఈటల గోదాములపై పురపాలక సంఘంలో విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు ఆరా తీశారు. దాదాపు 6.24 ఎకరాల్లో కట్టడాలున్నట్లు గుర్తించారు. దేవాలయ భూముల్లో ఆయనకు చెందిన గోదాముల వివరాలు, ఎంత విస్తీర్ణంలో నిర్మించారనే అంశంపైనా విచారణ చేపట్టారు. వాటికి సంబంధించిన అనుమతి పత్రాలతో పాటు పురపాలక సంఘానికి ఎంత పన్ను చెల్లిస్తున్నారు, ఎవరికి అద్దెకు ఇచ్చారనే అంశాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.