Telangana Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai) కు మరోసారి ప్రోటోకాల్ విషయంలో లోపం ఎదురైంది. తాజాగా ఆమె సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. నేడు (నవంబరు 10) గవర్నర్ తమిళిసై కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) ఆలయానికి వెళ్లారు. డీఆర్‌వో, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. కానీ, గవర్నర్‌కు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు అసలు పట్టించుకోలేదు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా ముందుకు రాలేదు.


ప్రొటోకాల్‌ అంశంలో అసంతృప్తి తెలుపుతూ ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం అవమానానికి గురి చేస్తోందని అన్నారు. అయినా మరోసారి ఆమెకు అదే అనుభవం ఎదురైంది. 


సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై కొమురవెల్లి మల్లికార్జున (Komuravelli Mallanna) స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం తమిళిసై మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కొమురవెల్లికి రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి పూర్తి చేయిస్తానని అక్కడి ప్రజలకు గవర్నర్ హామీ ఇచ్చారు.


ఆ తర్వాత తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) ఆలయం నుంచి బైరాన్ పల్లికి గవర్నర్ తమిళిసై (Komuravelli Mallanna) చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం వీరబైరాన్ పల్లిలో ఉన్న చరిత్రాత్మక బురుజును గవర్నర్ తమిళిసై సందర్శించారు.


మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్


మరోవైపు, యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై చర్చ కోసం తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు.  ఈ రోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉండటంతో మంత్రికి శుక్రవారం (నవంబర్ 11) అపాయింట్ మెంట్ ఇచ్చారు. యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై మంత్రి చర్చించనున్నారు. దీనిపై కొన్ని రోజులుగా టీఆర్ఎస్, రాజభవన్ మధ్య లేఖల విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 


కానీ గవర్నర్ నుంచి తమకు ఎటువంటి లేఖ రాలేదని మంత్రి సబిత చేసిన వ్యాఖ్యలపై మరోసారి రాజ్ భవన్ వర్గాలు స్పందించాయి. మెసెంజర్ ద్వారా సమాచారం ఇచ్చామని స్పష్టం చేశాయి. ఈక్రమంలో మరోసారి మంత్రి సబిత స్పందించి గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు గురించి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఉన్న సందేహాలన్నీ తీరుస్తామని తెలిపారు.