బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ దేవత. త్వరలో ఈ సీరియల్ కి శుభం కార్డు పడనుంది. అనుబంధాల ఆలయం అనే ట్యాగ్ లైన్ తో మా టీవీలో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ముగింపు కొచ్చింది. అర్జున్ అంబటి, సుహాసిని ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన దేవత ఇప్పటి వరకు(నవంబరు 10 నాటికి) 700 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ సీరియల్ ముగుస్తుందని త్వరలోనే దేవత పార్ట్ 2 రాబోతుందని చెప్తూ ఇందులో భాగ్యమ్మ పాత్రధారిగా నటించిన నటకుమారి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఒక గుడిలో క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అక్కడే సీరియల్ లో నటించిన వాళ్ళంతా కలిసి కూర్చొని సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఇన్ని రోజులు దేవత సీరియల్ ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈరోజుతో దేవత సీరియల్ అయిపోయింది. మళ్ళీ పార్ట్ 2 తో మీ ముందుకు వస్తాం. ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం’ అని భాగ్యమ్మ చెప్తుంది. మళ్ళీ పార్ట్ 2 లో హీరో ఎవరని పక్కన ఎవరో అడిగితే మళ్ళీ నేనే అంటూ అంబటి అర్జున్ అల్లరి చెయ్యడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అంటే ఈ సీరియల్ కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుందని కూడా చెప్పేశారు డైరెక్టర్.
ఇక కథ విషయానికి వస్తే అక్కా చెల్లెళ్ల చేసిన త్యాగం మధ్యలో నలిగిపోయిన భర్తగా అంబటి అర్జున్ చక్కగా నటించారు. పల్లెటూరి అమ్మాయి రుక్మిణి పొలం పనులు చేసుకుంటూ తన చెల్లెలి సత్యని ఉన్నత చదువులు చదివించి కలెక్టర్ చేయాలని ఆశపడుతుంది. అందుకోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతుంది. ఆ ఊరికి పెద్దగా దేవుడమ్మ ఉంటుంది. తనకి ఎదురు తిరుగుతుంది రుక్మిణి. న్యాయం కోసం ఎంతటి వాళ్ళని అయిన ఎదిరించే రుక్మిణి తత్వం చూసి తనకి కోడలిగా చేసుకోవాలని అనుకుంటుంది. దేవుడమ్మ కొడుకు ఆదిత్య, రుక్మిణి చెల్లి సత్య ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమలో పడతారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పే టైమ్ కి దేవుడమ్మ ఆదిత్య పెళ్లిని రుక్మిణితో నిశ్చయిస్తోంది. తల్లి మాట కాదనలేక ఆదిత్య తలవంచుతాడు.
Also Read: నందు వాళ్ళని బకరాల్ని చేసిన పరంధామయ్య- సామ్రాట్ ని ఫుట్ బాల్ ఆడుకున్న పెద్దాయన
అటు సత్య అక్క తన కోసం చిన్నప్పటి నుంచి పడిన కష్టం గుర్తు చేసుకుని ప్రేమించిన ఆదిత్యని వదులుకుంటుంది. దీంతో ఆదిత్య, రుక్మిణి పెళ్లి జరుగుతుంది. తర్వాత ఆదిత్య ప్రేమ విషయం తెలుసుకుని గర్భవతిగా ఉన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. చనిపోయినట్టు ఇంట్లో అందరినీ నమ్మించి చివరికి రామూర్తి అనే ఊరి పెద్ద దగ్గర ఆశ్రయం పొందుతుంది. రుక్మిణి చివరి కోరిక మేరకు దేవుడమ్మ సత్యని ఆదిత్యకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకి ఆదిత్య కలెక్టర్ అయి ఒక ఊరికి వెళతాడు. అక్కడ రుక్మిణిని చూస్తాడు. వాళ్ళకి కూతురు కూడా ఉందని తెలుసుకుని తనకి దగ్గర అయ్యేందుకు పడే తాపత్రయం చాలా బాగుంటుంది. ఒక తండ్రిగా తన కూతురు కళ్ళ ముందే ఉన్నా ఆ విషయం చెప్పలేక భార్యని దగ్గరకి తీసుకోలేక కట్టుకున్న రెండో భార్యకి న్యాయం చేయలేక నలిగిపోయే పాత్రలో అర్జున్ చక్కగా నటించి మెప్పించారు. చివరికి రుక్మిణి బతికే ఉందని దేవుడమ్మ కూడా తెలుసుకుంటుంది. ఆదిత్య, రుక్మిణి, సత్య మధ్య సాగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ రెండున్నర సంవత్సరాల పాటు సాగింది.
సుహాసిని, అర్జున్ తమ నటనతో సీరియల్ కి ప్రాణం పోశారు. ఇక పిల్లలుగా చేసిన దేవి, చిన్మయి కూడా తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులని సొంతం చేసుకున్నారు. తండ్రి ఎవరో తెలియక తన కోసం అల్లాడే పాత్రలో దేవి జీవించేసింది. ఎట్టకేలకి దేవి తన తండ్రి ఎవరో తెలుసుకుని సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక్కొక నిజం బయట పెట్టేస్తూ సీరియల్ కి ఎండ్ కార్డ్ కొట్టేస్తున్నారు. మరి అన్ని నిజాలు బయటకి వచ్చిన తర్వాత పార్ట్ 2 లో ఏ కథ పెట్టి ముందుకు తీసుకెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.