IND VS ENG Semifinal: టీ20 ప్రపంచకప్ 2022 లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ రెండింటిలో విజయం సాధించిన వారు ఫైనల్ లో పోటీపడతాయి.
బ్యాటింగ్ లో ఆ ఒక్కరు తప్ప
భారత బ్యాటింగ్ ను ప్రస్తుతం కలవరపెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. సూపర్- 12 లో జరిగిన 5 మ్యాచుల్లో 4 సార్లు రోహిత్ విఫలమయ్యాడు. పసికూన నెదర్లాండ్స్ పై మాత్రమే అర్థశతకం సాధించాడు. ఈ విషయం ఇప్పుడు జట్టుతో పాటు అభిమానులను కలవరపెడుతోంది. కీలకమైన నాకౌట్ మ్యాచులో భారత కెప్టెన్ కచ్చితంగా రాణించాల్సిందే. అయితే రాహుల్ ఫాం అందుకోవడం.. కోహ్లీ, సూర్య సూపర్ టచ్ లో ఉండడం భారత్ కు సానుకూలాంశం. హార్దిక్ పాండ్య ఆల్ రౌండ్ మెరుపులు ఇప్పటివరకు కనిపించలేదు. బౌలింగ్ లో కీలక సమయంలో వికెట్లు తీస్తున్నప్పటికీ బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది.
ఆ ఇద్దరిలో ఎవరు?
దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్.. భారత జట్టు యాజమాన్యం ఇప్పుడు వీరిద్దరి విషయంలో డైలమాలో ఉంది. ఫినిషర్ గా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్.. ఇప్పటివరకు ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచులో చోటు దక్కించుకున్న పంత్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు కీలకమైన సెమీస్ లో వీరిద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై యాజమాన్యం తర్జనభర్జనలు పడుతోంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచులో సీనియర్ అయిన దినేశ్ కార్తీక్ వైపు చూసే అవకాశాలు అధికం. అయితే కుడి, ఎడమ కాంబినేషన్ కావాలనుకుంటే మాత్రం పంత్ ను తీసుకునే అవకాశం ఉంది.
పేస్ సూపర్.. స్పిన్ డల్
ఈ మెగాటోర్నీలో మన పేస్ దళం అంచనాలను మించి రాణిస్తోంది. సీనియర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీతో పాటు అర్హ్ దీప్ సింగ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. భువి పవర్ ప్లే లో పరుగులు కట్టడి చేస్తుంటే.. అర్ష్ దీప్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతున్నాడు. ఇక షమీ మధ్య, ఆఖరి ఓవర్లలో రాణిస్తున్నాడు. నాలుగో పేసర్ గా హార్దిక్ పాండ్య కీలక సమయంలో వికెట్లు తీస్తూ బ్రేక్ ఇస్తున్నాడు. అయితే స్పిన్నర్లు రాణించకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. మిగతా జట్ల స్పిన్నర్లు అదరగొడుతున్న పిచ్ లపై మన స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ లు తేలిపోతున్నారు. అన్ని మ్యాచులకు జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలేదు. ఇక అక్షర్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో విఫలమవుతున్నాడు. మరి సెమీస్ కు అక్షర్ ను పక్కనపెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన చాహాల్ ను తీసుకుంటారేమో చూడాలి.
నిలకడలేని ఇంగ్లండ్
సెమీస్ లో భారత్ ప్రత్యర్థి అయిన ఇంగ్లండ్ చివరి నిమిషంలో సెమీస్ లో చోటు దక్కించుకుంది. పసికూన ఐర్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవటంతో ఇంగ్లిష్ జట్టు సెమీస్ కు చేరింది. పాయింట్ల పరంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సమంగానే ఉన్నప్పటికీ.. మెరుగైన రన్ రేట్ తో ఇంగ్లండ్ నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది.
ఇంగ్లండ్ కు నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. బ్యాటింగ్ లో ఒకరిద్దరు తప్ప ఎవరూ నిలకడగా ఆడడంలేదు. అలెక్స్ హేల్స్, హ్యారీ బ్రూక్ రాణిస్తున్నారు. కెప్టెన్ జోస్ బట్లర్ తన స్థాయికి తగ్గట్లు రాణించాల్సిన అవసరముంది. పేస్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ శ్రీలంకతో మ్యాచులో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. అదే ప్రదర్శన పునరావృతం చేయాలి. బౌలింగ్ లో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. సామ్ కరన్ మంచి ఫాంలో ఉన్నాడు. మార్క్ ఉడ్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీలతో పటిష్టంగా ఉంది.
ఇంగ్లండ్ పై భారత్ దే పైచేయి
రికార్డుల ప్రకారం ఇంగ్లిష్ జట్టుపై టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. టీ20 , వన్డే ఫార్మాట్లలో ఇంగ్లండ్ పై భారత్ ఆధిక్యంలో ఉంది.
రెండు జట్లు 22 టీ20ల్లో తలపడగా భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 సార్లు విజయం సాధించాయి.
టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో 3 సార్లు తలపడిన టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
సెమీఫైనల్ వేదిక అయిన అడిలైడ్ లో ఇంగ్లండ్ రికార్డు అంత బాగా లేదు. ఈ వేదికపై ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మాత్రమే గెలిచింది. ఇది భారత్ కు కలిసొచ్చే అంశం.
అడిలైడ్ మైదానంలో విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉంది.
ఇదే ప్రపంచకప్ లో ఈ వేదికపై బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించింది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఈ వేదికపై ఆడలేదు.
ఇవన్నీ టీమిండియాకు సానుకూలాంశాలు. ఫైనల్ గా రికార్డులు ఎలా ఉన్నా.. ఆరోజు ఎవరు ఎలా ఆడారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంది. కాబట్టి టీమిండియా తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇంగ్లండ్ పై గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.