టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలు కల్పించే ఆర్టీసీ బిల్లుపై వివరణ కోసం నేడు (ఆగస్టు 6) ఆర్టీసీ, ఆర్ అండ్ బీ అధికారులు తెలంగాణ రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులను గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ రాజ్ భవన్ కు పిలిపిస్తున్నారు. ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలను గవర్నర్ అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున కాసేపట్లో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గవర్నర్ తో భేటీ కానున్నారు. 


అయితే, ఈ ఆర్టీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. నేడే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తేనే దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడానికి వీలు పడుతుంది. ఈ క్రమంలో దీనిపై స్పీకర్ తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే బిల్లును స్పీకర్ అనుమతితో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.


ముందు గవర్నర్ వద్దకు ఎందుకంటే?


తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో భాగంగా సంబంధిత ఆర్టీసీ బిల్లును గవర్నర్‌కు పంపించారు. మామూలుగా అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అక్కడ పాసైన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. కానీ ఆర్థిక బిల్లులకు మాత్రం ముందుగానే గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ విలీనం ఆర్థిక బిల్లు కిందికి వస్తుండడం వల్ల గవర్నర్ వద్దకు వెళ్లింది.


అసెంబ్లీ సమావేశాల పొడిగింపు ఉంటుందా?


ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారన్న నమ్మకంతో మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ ఇంకా గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో వివాదం ఏర్పడింది. గతంలో అసెంబ్లీలో పాసయిన చాలా బిల్లులను ఇలా పెండింగ్ లో పెట్టి కొన్ని వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నేడు గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను పొడిగించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. 


మరోవైపు, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిల్లుపై కొన్ని సందేహాలున్నాయని.. ప్రభుత్వానికి రాజ్ భవన్ లేఖ పంపింది. ఈ లేఖకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సమాధానాలతో కూడిన లేఖను  రాజ్ భవన్ కార్యదర్శికి కూడా ప్రభుత్వం పంపింది. తాజాగా ఆర్ అండ్ బీ అధికారులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో ఈ అంశంపై వివరణ ఇవ్వనున్నారు.