Biometric Problems: తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గత లాక్ డౌన్ సమయంలో పాఠశాలలు మూత పడటంతో బయోమెట్రిక్ పరికరాలు చాలా వరకు చెడిపోయాయి. పరికరాలు బాగున్న బడుల్లో మాత్రమే బయోమెట్రిక్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం పనిచేయడం లేదు. దీంతో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనే అన్ని వివరాల రిపోర్టులను పై అధికారులకు చేరవేస్తున్నారు.


పరికరాలు పాడై కొన్నిచోట్ల, సిగ్నల్ లేక మరికొన్ని చోట్ల..


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసింది. కరోనా లాక్ డౌన్ తర్వాత గత రెండేళ్ల నుంచి ఈ బయోమెట్రిక్ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లోనే పని చేస్తోంది. సిగ్నల్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో బయోమెట్రిక్ విధానం పనిచేస్తున్నా.. సిగ్నల్ లేని చోట్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న పిల్లల నుంచి ఉపాధ్యాయుల వరకు చెట్లు, పుట్టల్లో తిరుగుతూ... సిగ్నల్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇవన్నీ చేయలేక అలాగే ఊరుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ఒకటి రెండు బయోమెట్రిక్ పరికరాలు ఉండి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు, వందల మంది విద్యార్థులు ఉండటం వల్ల సమయం సరిపోక బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించడం లేదు. బయోమెట్రిక్ పరికరాలు ఉన్నా అవి పనిచేయకుండా పోవడంతో మూలన పడేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరోనా సమయంలో మూలన పడేసిన బయోమెట్రిక్ పరికరాలను ఇప్పటికీ.. బయటకు తీయడం లేదు. 


విద్యార్థులు, ఉపాధ్యాయులు వేలల్లో..!


ఏజెన్సీ ప్రాంతాల్లోని సిగ్నల్ వ్యవస్థ లేని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు పని చేయకపోవడం వల్ల అవి మూలన పడి ఉన్నాయి. రోజువారీ హాజరు శాతాన్ని జీపీఎస్ యాప్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసి ఆ తర్వాత మళ్లీ తిరిగి సిగ్నల్ వ్యవస్థ వచ్చే చోటుకు చేరుకుని వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం 4గంటలకు పాఠశాల సమాచారం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఈ బయోమెట్రిక్ విధానం ద్వారా తెలియజేయాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఈ బయోమెట్రిక్ విధానం అమలు కావడం లేదు. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో ఒకట్రెండు బయోమెట్రిక్ పరికరాలు మాత్రమే ఉండడంతో వాటిని వాడట్లేదని చెబుతున్నారు. మరికొన్ని బయోమెట్రిక్ పరికరాలు అందిస్తే.. బాగుంటుందని అప్పడే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలమని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నింటిలో ఎన్ని బయోమెట్రిక్ లు ఉన్నాయి, వాటిలో ఎన్ని పని చేస్తున్నాయో తెలుసుకొని సరిపోయే సంఖ్యలో వాటిని అందిస్తే బాగుంటుందని చాలా మంది చెబుతున్నారు. అలాగే సిగ్నల్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తే మరింత బాగుంటుందని కోరుతున్నారు.