సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ట్రయల్‌ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్‌ చేసి జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తీసుకొని వెళ్లారు. వీరిని అరెస్టు చేసే సమయంలో పోలీసులు, భూ నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంత లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు భూ నిర్వాసితులకు గాయాలు కూడా అయ్యాయి. గుడాటిపల్లి గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.


గౌరవెల్లి ప్రాజెక్టు ఎందుకు?
హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతానికి సాగు నీరు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టు చేపట్టింది. 2007లో ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టును సందర్శించారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1.43 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 1.60 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డిజైన్లు మార్చింది.


నీరు అందే ప్రాంతాలు
కుడి కాలువ ద్వారా 90 వేలు, ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు నీరందుతుందనుంది. అక్కన్నపేట, హుస్నాబాద్‌ మండలాల్లోని 15, కోహెడ మండలంలోని 8, చిగురుమామిడి మండలంలోని 10, భీమదేవరపల్లి మండలంలోని 12, ధర్మసాగర్‌ మండలంలోని 13, ఘన్‌పూర్‌లోని 10, సైదాపూర్‌లోని 3, హన్మకొండ, జఫర్‌ఘడ్‌, రఘునాథపల్లి మండలాల్లోని ఐదు గ్రామాలకు సాగునీరు అందనుంది.


మరి నిరసనలు ఎందుకు?
తాజాగా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దాదాపు 95 శాతం వరకూ అన్ని పనులు పూర్తి కావొచ్చాయి. ప్రాజెక్టులో కీలకంగా ఉండే పంపు హౌస్‌ బిగింపు పనులు పూర్తి కావడంతో అధికారులు ట్రయల్ రన్‌ నిర్వహించాలని చూస్తున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహించనున్న నేపథ్యంలో భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయకుండానే ప్రాజెక్టు ట్రయల్ రన్‌ను ఎలా చేస్తారంటూ వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.


రేవంత్ రెడ్డి ట్వీట్
‘‘నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.