GHMC Mayor Vijayalakshmi: గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమైంది. గణేష్ నిమజ్జనాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గణేష్ నిమజ్జన శోభ యాత్ర రూట్ మ్యాప్ విడుదలైంది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షించారు. ఈసారి గణేష్ నిమజ్జనం ప్రత్యేకంగా మారింది. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు.


నిమజ్జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఆదేశించామన్నారు. ట్యాంక్‌బండ్‌పై 360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామన్నారు.  మొబైల్ క్రేన్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.  శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు.  రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలంటూ సూచించారు.  అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని తెలిపారు. 


వారం నుంచి ఏర్పాట్లలో అధికారులు
మేయర్ తో పాటు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. వేలసంఖ్యలో సిబ్బంది, అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మేయర్‌ చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో మంగళవారం(సెప్టెంబర్‌ 17) నిమజ్జనం జరగనున్న సంగతి తెలిసిందే. నిమజ్జనం కోసం పోలీసులు పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం  ఒంటిగంటకు ఖైరతాబాద్‌ గణేష్‌, నాలుగు గంటలకు బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం జరగనుందని పోలీసులు తెలిపారు. 



ప్రభుత్వం సమాయత్తం
నిమజ్జన సమయంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇక, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరనున్నారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు పూర్తయ్యాయి. 



30హెల్త్ క్యాంపుల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా గణేషుడి నిమజ్జన సందడి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‎లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‎కు లక్షలాదిగా తరలివస్తున్న గణేష్ భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంప్‎లను, అంబులెన్స్‎లతో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ కిట్లును అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.