Telangana budget 2023 : తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. అయితే ప్రభుత్వం నిధుల సమీకరణ ఎలా చేసుకుంటుందన్నది కీలకం. రూ. మూడు లక్షల కోట్ల కేటాయింపులు వివిధ పథకాలకు చేస్తే సరిపోదు.. ఆ మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారో కూడా పద్దుల్లోనే చూపించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కేంద్రం నుంచి  వస్తాయనుకున్న గ్రాంట్లు, నిధులు రాలేదు. చివరికి అప్పులపై కూడా పరిమితి విధించారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. 


ఆదాయ వృద్ధిలో రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ 


దేశంలోనే GSDP వాటాలో రెండో స్థానం సాధించిన తెలంగాణ.. 8శాతం సొంత పన్నుల ఆదాయం వాటాతో కేంద్ర ఆర్ధిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. 2019-20లో 69శాతం, 2020-21లో 72శాతం, 2021-22లో 73శాతం సొంత వనరుల రాబడి నుంచే ప్రభుత్వం వ్యయాలు చేసి సొంత కాళ్లపై నిల్చింది. ఇక కేంద్రం నుంచి 2014-15లో పన్నుల వాటా 8వేల 189కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ల రూపంలో 6వేల 736కోట్లు, 2022-23లో కేంద్ర పన్నుల వాటా 18వేల కోట్ల అంచనాల్లో 12వేల 407 కోట్లకు సవరించారు. నవంబర్‌ నాటికి 7వేల 568 కోట్లే ఖజానాకు చేరాయి. గ్రాంట్లు 8వేల 619కోట్లు మాత్రమే వచ్చాయి. గతం కంటే ఈ రెండు భారీగా తగ్గుదల నమోదయ్యాయి. అప్పుల్లో 19 వేల కోట్లు కోతలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదిలో కేంద్రం నుంచి 59వేల కోట్ల అంచనాల్లో 24వేలకోట్లే వాస్తవంలో తెలంగాణకు దక్కనున్నాయి. వచ్చ ఏడాది కూడా ఇంతకు మించి  పెద్దగా వస్తాయని కూడా ఊహించలేని పరిస్థితి. 
 
అప్పులపై పరిమితి ప్రభుత్వానికి పెద్ద సమస్య ! 


రాష్ట్రాల హక్కుగా ఉన్న స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ లోన్లపై ఆంక్షలతో అప్పులను తెచ్చుకునేందుకు కేంద్ర అనుమతి అవసరమన్న కొత్త సవరణతో  తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటివరకు లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి తాజా విపత్కర పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేం దుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి. ఇప్పటికే కార్పొరేషన్ల పేరుతో చేసిన గ్యారంటీ అప్పులను నిలిపివేయగా తుది దశలో ఉన్న ప్రాజె క్టులు, ఇతర అవసరాలకు నిధుల సమన్వయం రాష్ట్ర ప్రభు త్వానికి కత్తీమద సాముగా మారింది. ఇంతటి విషమ సమ యంలో ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయ కుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్థిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చేస్తోంది. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్‌ జీఎస్టీ బకాయిలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పేరుతో ఏపీకి తరలిన నిధులు, ఇతర ఆదాయాలను పొందేలా  రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంటోంది.


ఓటు బ్యాంక్ పథకాలతో అధిక భారం ! 


రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్య క్రమాలు, చర్యలతో గడచిన ఐదారేళ్లుగా ఆర్థిక సుస్థిరతను కొనసాగించుకుంటూ ముందుకు సాగు తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేత నాలతో సతమతమవుతున్న  రాష్ట్రం తెలంగాణనే అనుకోవచ్చు.  గతేడాది కంటే రూ.1500 కోట్లు అదనంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపైనే భారం పెరిగినప్పటికీ పీఆర్సీ ప్రకటన వంటి అంశాల్లో జాప్యం చేయలేదు. అంతేస్థాయిలో ఇతర వ్యయాలు కూడా భారీగా పెరగ్గా, రాబడిని అంతకంతకూ పెంచుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.


కేంద్రాన్ని నమ్ముకుంటే కష్టమే !


కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పెద్ద మొత్తంలో వస్తాయని నమ్ముకుంటే.. నిరాశే మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాదే రూ. యాభై వేల కోట్లు వస్తాయనుకుంటే.. దాదాపుగా ఇరవై వేల కోట్లు తక్కువ వచ్చింది. మరి రూ. మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలంటే..కనీసం రూ. లక్ష కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లు.. పన్నుల ఆదాయాన్ని ఆశించాల్సిఉంటుంది. కానీ  కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త బడ్జెట్ ప్రకారం   2023–24 లో రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు మాత్రమే  అందనున్నాయి.   ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతోపాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌‌ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. సెంట్రల్ జీఎస్టీ, ఇన్​కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్‌‌ల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 10.21 లక్షల కోట్లను కేంద్రం పంపిణీ చేయనుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102% నిధులు.. అంటే రూ.21,470 కోట్లు తెలంగాణకు వస్తాయి.