Telangana News |  హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ (Ganesh Mandapams), దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రకటించింది. అనుమతి పొందిన గణేష్, దుర్గా మాత మండపాలకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆగస్టు 27 నుంచి గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభం కానున్న క్రమంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో గణేశ్‌ మండపాల ఏర్పాట్లు వేగవంతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఆకర్షణీయమైన ఖైరతాబాద్‌ గణనాథుడి (Khairatabad Ganesh) విగ్రహ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు వచ్చేసింది. 

గణేష్ మండపాల ఏర్పాటుపై పోలీసులు కీలక మార్గదర్శకాలు

వినాయక చవితి కోసం మండపాల ఏర్పాటు, విగ్రహాల తరలింపు వేగంగా సాగుతున్న క్రమంలో తెలంగాణ పోలీసులు కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు  పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలు, హెచ్చరికలను పోలీసులు స్పష్టంగా తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, ఏ ఇబ్బంది లేకుండా జరిగేందుకు పోలీసులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

మండపాల కోసం పాటించాల్సిన నిబంధనలు

  • విగ్రహాలు ఏర్పాటు చేసే మండపం కోసం ఆన్‌లైన్‌లో పర్మిషన్ తప్పనిసరి. నిర్వాహకులు Telangana Police Portal  https://policeportal.tspolice.gov.in/index.htm  ద్వారా అనుమతి పొందాలి.  
  • విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టి, విద్యుత్ అధికారుల అనుమతి తీసుకోవాలి.
  • మండపాల నిర్మాణ పనులను నిపుణుల చేతుల్లో పెట్టాలి. స్వయంగా విద్యుత్ పనులు చేయకూడదు.
  • మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూడదు. ప్రజలకు అసౌకర్యం కలిగించరాదు.
  • డీజేలకు అనుమతి లేదు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడరాదు.
  • మైక్ వినియోగంలో సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనలకే పరిమితం కావాలి.
  • మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.
  • వర్షాలను దృష్టిలో ఉంచుకొని మండప నిర్మాణం, ఏర్పాట్లు చేయాలి.
  • భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు ఉండాలి.
  • వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించరాదు.
  • ట్రాఫిక్, క్యూలైన్ల నియంత్రణకు వాలంటీర్లను నియమించాలి.
  • మండపాల వద్ద శుభ్రత తప్పనిసరిగా పాటించాలి.
  • మండప నిర్వాహకుల పూర్తి వివరాలతో పాయింట్ బుక్ సిద్ధం చేయాలి.
  • అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
  • నిమజ్జనం కోసం కేటాయించిన అధికారిక ప్రదేశాలనే వినియోగించాలి. పోలీస్ అనుమతి కాపీని మండపంలో ప్రదర్శించాలి.

నవరాత్రి మండపాల కోసం సూచనలు

  • అగ్నిప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
  • విద్యుత్ కనెక్షన్లను సురక్షితంగా ఏర్పాటు చేయాలి. చిన్నారులకు అందని విధంగా వైర్లను అమర్చాలి.
  • వాలంటీర్లను స్థానికులలోంచి ఎంపిక చేసి, వారికి ఐడీ కార్డులు కల్పించాలి.
  • రాత్రిపూట కూడా వాలంటీర్లు మండపం వద్ద ఉండేలా చూడాలి.
  • భక్తులను తనిఖీ చేసిన తర్వాతే మండపంలోకి అనుమతించాలి.

ఉత్సవ నిర్వాహకులకు పోలీసుల సూచనలు

  • మండపాల వద్ద టపాకాయలు, మందుగుండు సామగ్రి ఉంచరాదు.
  • ఎమర్జెన్సీ లైటింగ్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలి.
  • జనరేటర్ ఉపయోగిస్తే, ఇంధనాన్ని మండపానికి దూరంగా నిల్వ చేయాలి.
  • సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలి.
  • మండపాల చుట్టూ అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను ఉంచరాదు.
  • సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ల వినియోగం నిర్ణీత డెసిబెల్స్ వరకు మాత్రమే పరిమితం చేయాలి.
  • ఆసుపత్రులు, విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న మండపాలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.
  • నిమజ్జనం కోసం కేటాయించిన రూట్లలోనే ప్రయాణించాలి.

విగ్రహాల తరలింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో విగ్రహాలను తరలించరాదు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలోనే వి తరలింపు జరగాలి.
  • విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ ఎంపిక చేయాలి.
  • నిపుణులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి. చిన్న వాహనాల్లో భారీ విగ్రహాలను తరలించరాదు.
  • పిల్లలను విగ్రహాల తరలింపు కోసం తీసుకెళ్లరాదు.
  • విద్యుత్ వైర్ల విషయంలో జాగ్రత్త వహించాలి.
  • భారీ విగ్రహాల తరలింపులో తప్పనిసరిగా క్రేన్‌లను ఉపయోగించాలి.