సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల్లో పైరవీల జోరు సాగుతుంది. మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తామని పేర్కొంటూ కార్మికుల వద్ద కొంత మంది పైరవీకారులు భారీగానే డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు 58 ఏళ్ల పైబడిన వారు అనారోగ్యానికి గురైతే వారు మెడికల్ బోర్డుకు ధరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డుకు హాజరైన కార్మికుడి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మెడికల్ అన్‌ఫిట్ అయితే వారి వారసులకు తిరిగి సింగరేణిలో ఉద్యోగం కల్పిస్తారు. తమ వారసులకు ఉద్యోగం కల్పించేందుకు కార్మికులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకొని వారి వద్ద లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మోసపోయిన కార్మికులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మెడికల్ అన్‌ఫిట్ కోసం దళారీ చేతిలో మోసపోయిన కార్మికుడు కొత్తగూడెంలో పోలీసులను ఆశ్రయించాడు. ఇందుకు సంబందింoచిన వివరాలిలా ఉన్నాయి.
సింగరేణి సంస్థలో పనిచేసిన పిల్లి రామకృష్ణ అనే కార్మికుడు రెండేళ్ల క్రితం మెడికల్ అన్‌ఫిట్ కోసం కాంట్రాక్టరుగా పనిచేస్తున్న జి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కలిశాడు. ఒక నెలలో పనిచేస్తామని నమ్మబలకడంతో అతని మాటలు నమ్మి రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే డబ్బులు ఇచ్చి రెండేళ్లు పూర్తి అయినప్పటికీ రామకృష్ణకు మెడికల్ అన్‌ఫిట్ కాకపోగా ఉద్యోగం నుంచి కూడా రిటైర్డ్ అయ్యాడు. అయితే తాము మోసపోయామని గ్రహించిన రామకృష్ణ అనేక మార్లు డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పినప్పటికీ వెంకటేశ్వర్లు మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారీ ఎత్తున చేతులు మారుతున్న సొమ్ములు..
సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో సాగుతున్న మెడికల్ బోర్డు వ్యవహారంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో సింగరేణి వ్యాప్తంగా అనేక కేసులు సైతం నమోదయ్యాయి. తమ వారసులకు ఉద్యోగం వస్తుందనే సింగరేణి కార్మికుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కొ కార్మికుడి వద్ద రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గతంలో కొంత మంది అధికారులపై ఆరోపణలు రావడంతో వారిపై సంస్థాగతంలో విజిలెన్స్ విచారణ నిర్వహించారు. ఏది ఏమైనప్పటికీ సింగరేణి సంస్థలో జరుగుతున్న మెడికల్ అన్‌ఫిట్ వ్యవహారంలో కార్మికులు దళారులు చేతిలో మోసపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: Cm Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ... నోటీసులు జారీ చేసిన హైకోర్టు
Also Read: Nagari Roja : నగరిలో రోజాకు "పంచ పాండవుల" కటీఫ్ .. మూడో సారి తప్పు చేయబోమని ప్రతిజ్ఞ !
Also Read: Jagananna Vidya Deevena: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్... విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు