Just In





Seetha Dayakar Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, 3 నియోజకవర్గాల నుంచి చేరికలు
Sita Dayakar Reddy joined Congress Party: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Sita Dayakar Reddy joined Congress Party:
హైదరాబాద్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం గాంధీభవన్ కు వచ్చిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి.. తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షఉడు రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతా దయాకర్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు, ఆమె అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు జి.మధు సుధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దివంగత ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి భార్యనే ఈ సీతా దయాకర్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజక వర్గాలకు చెందిన దయాకర్ రెడ్డి అనుచరులు, కుమారులు కొత్త కోట సిద్ధార్థ రెడ్డి, కార్తీక్ రెడ్డిలతో కలిసి గాంధీ భవన్‌కు వచ్చి ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ లో చేరినా టిక్కెట్ లభించేనా ?
దయాకర్ రెడ్డి కుటుంబానికి మక్తల్, దేవరకద్రల్లో పెద్ద ఎత్తున అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. భార్యాభర్తలు, సీతా దయాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డిలు పలు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా అనేది కష్టమే అన్న వాదన వినిపిస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ లో కీలకమైన దయాకర్ రెడ్డి దంపతులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో దయాకర్ రెడ్డి దంపతులు కీలకంగా వ్యవహరించారు. అమరచింత నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీతా దయాకర్ రెడ్డి 2002లో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పాటైన నియోజకవర్గం దేవరకద్ర నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో భార్యభర్తలు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా మక్తల్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.
టీడీపీని వీడుతూ కంటతడి..
సుదీర్ఘకాలం దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో కొనసాగారు. అయితే గత ఏడాది వీరు టీడీపీని వీడారు. టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
మక్తల్, దేవరకద్ర రెండు నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి దంపతులకు మంచి పట్టు ఉందని వారిని ప్రధాన పార్టీలు గతేడాది ఆహ్వానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్ నెలలో దయాకర్ రెడ్డి కన్నుమూశారు. దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు చంద్రబాబు.