KTR Comments on Khammam Attack: ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగిన ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ గుండాలు తమ నేతలపై దాడి చేశారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆయన ఖండించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని కేటీఆర్ అన్నారు.


మీరు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండటమే తప్పా? ప్రజలకు సేవ చేయటం చేత కాదు.. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటమా? సిగ్గు చేటు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాంటి ఎన్ని దాడులు చేసిన సరే.. ప్రజల వద్ద బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. మీకు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయం’’ అని కేటీఆర్ అన్నారు.






హరీశ్ రావుపై దాడి
ఖమ్మం పర్యటనకు వెళ్లిన హరీష్‌ రావు వాహనాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకోవడం ఘర్షణకు దారి తీసింది. మాజీ మంత్రులు సబిత, పువ్వాడ వాహనాలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై హరీశ్ రావు మాట్లాడుతూ.. వరద బాధితులకు తగిన సాయం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖమ్మంకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని హరీశ్ రావు కోరారు. తద్వారా ప్రధానిని నిలదీద్దామని హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర నిర్లక్ష్యానికి మహబూబాబాద్‌, ఖమ్మం ప్రజలు బలైపోయారని.. సాగర్‌ కెనాల్‌ కొట్టుకుపోవడం వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.