Vijayawada Floods: వరద బాధితులకు సహాయం చేయడంలో అలసత్వం చేసిన అధికారులపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు... కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. వరద నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించినట్టు చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా విజయవాడలోనే ఉందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, నీళ్లు అందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని.. పది జిల్లాల నుంచి వస్తుందన్నారు. ఏ ఒక్కరు కూడా ఆకలి దాహంతో ఇబ్బంది పడకూడదని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టు వివరించారు. 


కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరుతోపాటు వరద సాయం, వరదలు రావడంపై జరుగుతున్న ప్రచారం, ప్రభుత్వం స్కూల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఇలా అన్నింటిపై కూడా ప్రభుత్వం మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా చెప్పడం సంచలనంగా మారింది. 


ప్రజలు బాధల్లో ఉంటే ఆదుకోవాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని కచ్చితంగా ఆఖరి బాధితుడిని ఆదుకునేందుకు ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి డివిజన్‌కు అధికారులను నియమించామని వారి ఫోన్ నెంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పాములు, తేళ్లు వస్తున్నట్టు ప్రజలు ఫోన్లు చేస్తున్నారని అలాంటి సమస్యలను అధికారులు వెంటనే అడ్రెస్ చేయాలని సీఎం సూచించారు. 


ప్రజలకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని చంద్రబాబు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందలేదని, నీళ్లు లేవని ఇలా రకరకాల సమస్యలు వస్తున్నాయని వాటిని వెంటనే అధికారులు అక్కడకు పంపించి సమస్య పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. టెక్నాలజీపై ఆధార పడటమే కాకుండా తానుకూడా స్వయంగా పరిశీలించి కొన్ని సమస్యలు తెలుసుకుంటున్నానని అన్నారు. 


ఇప్పటి వరకు అధికారులకు చెబుతూ వచ్చామని ఇకపై ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇకపై ఎవర్నీ ఉపేక్షించేది లేదన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది మన ఫ్యామిలీకి వచ్చిన సమస్య అని అందరూ సహకరించాలని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చేతనైన సాయం చేయాలని సూచించారు.