నల్గొండ ఎన్‌జీ కళాశాల మైదానంలో ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ 'రాజ్యాధికార సంకల్ప సభ' నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ శ్రేణులు, స్వేరోస్ ప్రతినిధులు భారీగా వచ్చారు. ఈ సభలోనే బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ సమక్షంలో ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్.. ఇటీవల స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
మర్రిగూడ బైపాస్ నుంచి సభా వేదిక వరకు ప్రవీణ్‌కుమార్.. ర్యాలీగా వచ్చారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీగా సభకు తరలివచ్చారు. ర్యాలీలో స్వేరోస్ ప్రతినిధులు, బీఎస్పీ కార్యకర్తలు ఎక్కువగా పాల్గొన్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సభ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది..కార్యకర్తలు, ఆయన అభిమానులతో సభ ప్రాంగణం నిండిపోయింది. సభకు రాకుండా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అయినా.. ఎవరూ ఆగలేదని అన్నారు. తాను రాజీనామా చేసిన రోజే కేసు పెట్టారన్నారు. ఇలా ఎంతమందిపై కేసులు పెడతారని ప్రశ్నించారు..అణగారిణ వర్గాల ప్రజల బిడ్డ ప్రవీణ్ కుమార్ అని, వీళ్లందరని ప్రభుత్వం ఎలా నిలువరిస్తుందని ఆయన ప్రశ్నించారు. అయితే ఆయన మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేశారు. అతి త్వరలోనే ప్రగతి భవన్‌కు పోదామని అన్నారు. కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ వెళతారా? అని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణలో గురుకులాలకు కార్యదర్శిగా తనదైన ముద్ర వేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చినట్టైంది. కొద్ది వారాల క్రితం ఆయన ఉన్నట్టుండి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. తొలుత టీఆర్ఎస్‌లో చేరుతారని, కొత్త పార్టీ పెడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి జిల్లా పర్యటిస్తూ వివిధ సమావేశాల్లో పాల్గొంటూ వచ్చారు.
1995 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్.. ఆగస్టు 8న యూపీకి చెందిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ మాయవతి గతంలోనే ప్రకటించారు. తాజాగా ప్రవీణ్ కుమార్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు బీఎస్పీలో చేరారు. అయితే, ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో తాను బీఎస్పీలో చేరడం లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
హుజూరాబాద్ టికెట్ అంటూ తొలుత ప్రచారం
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్యంగా రాజీనామా చేయగానే, ఆయన ముందుగా టీఆర్ఎస్‌లో చేరతారని విపరీతమైన ప్రచారం వచ్చింది. హుజూరాబాద్ టికెట్ ఆయనకే అంటూ ఊహాగానాలు వచ్చాయి. ఎస్సీలు ఎక్కువగా ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తారనే విపరీతమైన ప్రచారం జరిగింది. అంతేకాక, సొంత పార్టీ ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇవన్నీ కాదని తేలిపోయింది.
ఇప్పటికే ప్రవీణ్ కుమార్.. ప్రభుత్వంపై దూకుడుగా స్పందిస్తున్నారు. తాను పాల్గొన్న సభలలో.. తాను మాట్లాడే సమయంలోనే కావాలనే పవర్ కట్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. అదేవిధంగా తనతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.