వచ్చేవారం పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు సమస్యలపై చర్చించేందుకు, విపక్షాల గళం వినేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సభకు రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మూడు నిమిషాల నిడివి గల ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 










'మిస్టర్ మోదీ.. మా గళాన్ని వినండి' అంటూ ఓబ్రియన్ ప్రధానిని కోరారు. ఈ వీడియోలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, శివసేన, టీఆర్ఎస్, డీఎమ్ కే, సీపీఐ(ఎమ్), ఆర్ జేడీ, ఎన్ సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన సభ్యులు పలు సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెగాసస్ వివాదం, సాగు చట్టాలపై రైతుల పోరాటం, నిత్యవసర సరుకుల ధరల పెంపు, పెరుగుతున్న అత్యాచార కేసులపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.


కేంద్రంలో మోదీ సర్కార్ ను ఎదిరించేందుకు విపక్షపార్టీలన్నీ కలిసి రావాలని టీఎమ్ సీ మరోసారి ఈ వీడియోతో పార్టీలను కోరింది. అయితే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన రోజే మోదీ సభకు హాజరయ్యారు. కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.


ఆ తర్వాత నుంచి సభ కార్యకలాపాలను విపక్ష నేతలు అడ్డుకుంటున్నారు. ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వం.. భారత్ లోని జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయనాయకుల ఫోన్ లను పెగాసస్ స్పైవేర్ తో ట్యాప్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై చర్చించాలని కోరుతున్నారు.


జులై 19న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఆగస్టు 13న ముగుస్తాయి. ఈసారి మొత్తం 19 రోజులు సభ నడుస్తోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా సమావేశాల నిర్వహణను కట్టుదిట్టంగా చేశారు. కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. భౌతిక దూరాం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. 


సాధారణంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై మూడో వారంలో మొదలై ఆగస్టు 15 కన్నా ముందే పూర్తవుతాయి. అయితే గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ లో మొదలయ్యాయి.