Gadala Srinivasa Rao: తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావుకు రాజకీయాల్లోకి రావాలని తెగ ఆసక్తిగా ఉంది.  ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన స్నేహితుడు రాము దరఖాస్తు చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన దరఖాస్తు సమర్పించారు.  


గడల శ్రీనివాసరావు డైరక్టర్ ఆఫ్ హెల్త్ గా చాలా కాలం పని చేశారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉన్నారు. కేసీఆర్ టిక్కెట్ ఇస్తారని ఆశ పడ్డారు.  బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారు. కొత్తగూడెం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. వీలు కుదిరినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొత్తగూడెంలో సామాజిక సేవా కార్యక్రమాలతో కేసీఆర్ దృష్టిలో పడేందుకు యత్నించారు. హెల్త్ డైరెక్టర్ పదవిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు.


ఓ సందర్భంలో ఆయన కేసీఆర్ కాళ్లు మొక్కారు. అప్పట్లో ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  పదవీకాలం పొడిగించడం కోసం కెసిఆర్ కాళ్లు మొక్కి స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారని..  కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం అలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పని చేయడం ఏమిటని విమర్శలు వచ్చినా గడల శ్రీనివాసరావు పట్టించుకోలేద. అయన కొత్తగూడెం చుట్టూ తిరిగారు. చివరికి అయినా కేసీఆర్ తనకు టిక్కెట్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ టిక్కెట్ల కసరత్తు సమయంలో హడావుడి చేయడంతో  వైద్య మంత్రిగా ఉన్న హరీష్ రావు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆయన సైలెంట్ అయిపోయారు. 


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను డీహెచ్ పోస్టు నుంచి బదిలీ చేశారు.  తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ పదవికి ఆయన దరఖాస్తు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం ఎంపీ స్థానానికి హస్తం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సోనియా పోటీ చేయకుంటే కచ్చితంగా తనకు సీటు వస్తుందని సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి తదితరులు ఖమ్మం సీటు ఆశిస్తున్నారు.


గడల శ్రీనివాసరావుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు కానీ..ఆయన వ్యక్తిత్వం ఏమిటో ఈ దరఖాస్తుతోనే తేలిపోయిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కాకా పట్టడం.. రాజకీయ అకాంక్షలసు తీర్చుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.