LK Advani Bharat Ratna: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రమంత్రులు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పురస్కారం ప్రకటించడంపై ఎల్‌కే అద్వానీ స్పందించారు. ప్రత్యేకంగా ఓ స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డుని స్వీకరిస్తున్నానని వెల్లడించారు. ఇది తనకే కాకుండా...తన సిద్ధాంతాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. తన జీవితం దేశం కోసమే అని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, ఆ నియమానికే ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయతో పాటు అటల్ బిహారీ వాజ్‌పేయీని స్మరించుకున్నారు. ఆ ఇద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించడంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. పలువురు కేంద్రమంత్రులూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు తగని గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. 


"ఎంతో వినయంగా ఈ భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాదు. నేను ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నాను. 14 ఏళ్లకే నేను RSSలో చేరాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. నేనే పని చేసినా అది దేశం కోసమే అని. ఈ జీవితం నాకోసం కాదు..దేశం కోసం అన్న సిద్ధాంతాన్నే బలంగా నమ్మాను. ఇవాళ పండిట్ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీని మనసారా స్మరించుకుంటున్నాను. లక్షలాది పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులు నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. వాళ్లే నా బలం. ఈ పురస్కారం అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు"


- ఎల్‌కే అద్వానీ, బీజేపీ సీనియర్ నేత 


 



Also Read: LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు