Five IAS have been transferred in Telangana :  తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి (CS Santhi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు.   సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు.  సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించించారు.  వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్‌ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.  అలాగే వరంగల్ (Warangal) జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.  ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు అదనపు హోదాలో  చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్.                                                                     


లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  భారీగా బదిలీలు చేస్తున్నారు.  సుదీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి  ప్రభుత్వం స్థానచలనం కలిగిస్తోంది.  వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేస్తోంది.  ఎన్నికలు సమీపించిన సమయంలో ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ బదిలీలు సంభవిస్తుంటాయి. ఇటీవల డీఎస్పీలను కూడా పూర్తి స్థాయిలో మార్చారు.   దీనికి కొనసాగింపుగా- ఎక్సైజ్‌ శాఖలో బదిలీలకు పూనుకుంది ప్రభుత్వం. మున్ముందు ఐఎఎస్, ఐపీఎస్ స్థాయి అధికారుల బదిలీలు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల పదో తేదీలోపున ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.                            


ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ భారీగా అధికారుల బదిలీలు చేపట్టలేదు. సీఎస్‌గా బీఆర్ఎస్ హయాంలో నియమితలైన  శాంతికుమారినే కొనసాగిస్తున్నారు. ఎన్నికల సంఘం డీజీపీగా రవిగుప్తాను నియమించడంతో ఆయననే కొనసాగిస్తున్నారు.       


బదిలీలు రాజకీయ పరమైనవి కావని.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు..    నిబంధనల మేరకు బదిలీలు చేస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిని కూడా బ దిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలకు అత్యంత ముఖ్యమైన కలెక్టర్ల విషయంలో రేవంత్ రెడ్డి అత్యంత సమర్థులైన వారికే పోస్టింగ్ లు ఇవ్వాలని సీఎస్‌కు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.