Fire Accident at Gudimalkapur హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ లోని అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. పది అంతస్తుల భవనంలో ఓచోట మంటలు చెలరేగి, క్రమంగా మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఐదో అంతస్తులో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా శ్రమించి హాస్పిటల్ లో చెలరేగిన మంటల్ని ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని సిబ్బంది చెబుతున్నారు.

  




కింది ఫ్లోర్ లలో మంటలు చెలరేగాయి. క్రమంగా పై అంతస్తు వరకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. హాస్పిటల్ లో బిల్డింగ్ ఎలివేషన్ మెటీరియల్ కు నిప్పు అంటుకోవడంతో మంటల తీవ్రత అధికమైనట్లు భావిస్తున్నారు. మంటల్ని గమనించిన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను వేరే ఫ్లోర్ లోకి తరలిస్తున్నారు. ఈ హాస్పిటల్ లో అధికంగా పేషెంట్లు చిన్నారుల, గర్బిణీలు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేయడంతో ముప్పు తప్పింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


24 గంటలు గడవకముందే మరో అగ్నిప్రమాదం..
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలోని ఆరో అంతస్తులో మంటలు చెలరేగగా, ఓ కుటుంబం అందులోనే చిక్కుకుపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్, తలుపు బయట నుంచే ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు రప్పించారు. ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లి కుటుంబాన్ని రక్షించిన కానిస్టేబుల్ ను అంతా అభినందించారు.