Telangana: రేషన్ బియ్యం పంపిణీలో జరిగే అక్రమాలు అంతా ఇంతా కాదు. పై నుంచి దిగువన రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ చేసే వరకు ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి, తిరిగి అవే బియ్యాన్ని తక్కువలో తక్కువ రూ. 15 కు అమ్ముకుంటారు. ఈమధ్య చాలా రేషన్ దుకాణాదారులు.. పూర్తి స్థాయిలో బియ్యం కూడా ఇవ్వడం లేదు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలె డీలర్ల వేలిముద్రల ఆధారంగానే ఎంఎస్ఎస్ పాయింట్ (మండల స్థాయి నిల్వ కేంద్రం) నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం అందించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తాజాగా రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడి ఈ-కేవైసీ నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. ఇందుకోసం చౌక ధరల దుకాణాల్లోని ఈ-పోస్ యంత్రంలో అవసరమైన సాంకేతికతను పొందుపరిచారు. ఈ నెల 6వవ తేదీన బియ్యం పంపిణీ ప్రారంభం ్యింది. కాగా.. కార్డులోని సభ్యులు అందురూవ వచ్చి వేలి ముద్రలు వేయాలని డీలర్లు అవగాహన కల్పిస్తున్నారు. ఒక వేళ వేలిముద్ర పడకుంటే ఐరిస్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంటున్నారు.


ప్రస్తుతం రేషన్ కార్డులోని ఒక సభ్యుడిని ఒక యూనిట్ గా పరిగణిస్తూ ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉంటే మాత్రం 24 కిలోల బియ్యాన్నే అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,251 రేషన్ దుకాణాల పరిధిలో 90 లక్షల 5,289 కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 2,82,48,886 మంది సభ్యులు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా కార్డులోని సభ్యుల విషయంలో పక్కా సమాచారం ప్రభుత్వ వద్ద అందుబాటులో లేదు. అదనంగా, మరణించినా వారి పేర్లపై బియ్యం తీసుకుంటున్నారు చాలా మంది. కోటా మించి సరఫరా చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ-కేవైసీ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కొన్ని నెలల పాటు సభ్యులు అందరి వేలిముద్రలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు ఉన్నత అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా నమోదు చేయని సభ్యుల పేర్లను తొలగించనున్నారు. మరోవైపు కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో వాస్తవ లబ్ధిదారుల సంఖ్య తేలనుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.