Fifth Calss Students Wrote English Book: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఓ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో ఏకంగా ఐదో తరగతిలోనే ఇంగ్లీష్ పుస్తకం రాశారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అందించిన ప్రోత్సాహంతో ఆంగ్ల కథల సంపుటిని రాశారు. ఈ పుస్తకాన్ని ఈ నెల 11న ఎన్టీఆర్ గార్డెన్ (NTR Garden) లో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించడానికి బాల సాహిత్య రచయితలు డా.వీఆర్ శర్మ, డా.గిరిపెల్లి అశోక్ ల నుంచి అనుమతి లభించింది.


కథలతో ఆసక్తి


ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్ గూడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు బుక గంగయ్య వినూత్న బోధన పద్ధతులతో పిల్లలతో చేసిన ఈ ప్రయత్నం అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించే ఆలోచనతో గంగయ్య రోజువారీ పాఠ్యాంశాల బోధనలతో భాగంగా ఆటపాటలతో, వివిధ పాత్రలతో కథలను వివరించడం, వాటిని తిరిగి రాయించడంతో పిల్లల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఐదో తరగతి విద్యార్థులు 18 మంది ఇంగ్లీష్ లో కథలు రాశారు. వాటిలో తొలుత కొన్ని తప్పులను గుర్తించిన గంగయ్య.. అన్వయ, వ్యాకరణ దోషాలను గుర్తించి వాటిని సరి చేసేలా హోం వర్క్ గా విద్యార్థులతో రాయించడంతో వారిలో పరిణతి వచ్చింది. తర్వాత వారు రాసిన వాటన్నింటినీ ఓ దగ్గర చేర్చి, పూర్తిగా తప్పులు లేకుండా చేసి.. 'ద స్టోరీస్ ఆఫ్ యాపల్ గూడ చిల్డ్రన్' పేరిట పుస్తకాన్ని ముద్రించారు. ఈ కథలన్నీ నేటి తరానికి దిశానిర్దేశం చేసేలా ఉంటాయని గంగయ్య తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు తురాటి గంగన్న అందించిన ప్రోత్సాహం, విద్యార్థుల ఆసక్తితో పుస్తకం తీసుకురావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆధునిక పేర్లతో పాత్రలకు ప్రాణం పోసి చిన్న పదాలతో సంభాషణలను చక్కగా రాశారని వివరించారు.


బుక్ ఫెయిర్


అటు, 36వ హైదరాబాద్ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం నుంచి కొలువుదీరనుంది. ఈ ఫెయిర్ లో 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరూ గౌరీశంకర్ తెలిపారు. పుస్తక ప్రదర్శన సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని అన్నారు. ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకూ పుస్తక ప్రదర్శన ఉంటుందని.. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకూ ఉంటుందని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును, వేదికకు సంస్కృత పండితుడు రవ్వా శ్రీహరి పేర్లను నామకరణం చేస్తున్నట్లు వెల్లడించారు. 'బాలప్రపంచం' పేరుతో పిల్లలకు పెయింటింగ్, క్విజ్, సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Also Read: BRS : గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు షాక్ - మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్ధీన్ కాంగ్రెస్‌లో చేరిక !