BRS MLA's Poaching case :    తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ ఎస్‌ మధ్య జరుగుతున్న పోరులో మరోసారి కాషాయమే పై చేయి సాధించిందన్న వార్తలు మరోసారి వినిపిస్తున్నాయి. కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సిట్‌ చేతుల నుంచి జారి సీబీఐ చేతికి చేరింది. ఈ పరిణామం బీఆర్‌ ఎస్‌ పార్టీకి ఎలాంటి జలక్‌ ఇవ్వబోతోంది ?  నిన్నటివరకు ఆరోపణలు ఎదుర్కోంటోన్న బీజేపీ ఇప్పుడు సీబీఐ క్లీన్‌ చిట్‌ తో ప్రజల ముందుకు రాబోతోందా ? ట్రాప్ కేసు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఇబ్బంది పెడుతుందా ?


కేసీఆర్ చేతిలో ఉన్న ఒక్క ఆయుధం జారిపోయిందా ?


బీజేపీపై పోరాటంలో కేసీఆర్ చేతిలో ఉన్న ఆయుధం జారిపోయిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల కోనుగోళ్లు కేసులో సిట్‌ విచారణ జరుపుతున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అసలు ఎందుకు న్యాయస్థానం ఈ తీర్పు నిచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్‌ విచారణ సరిగ్గా లేదని మొదటి నుంచి నిందితులు అలాగే ఆరోపణలు ఎదుర్కోంటోన్న బీజేపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. కక్షపూరిత రాజకీయాలతో ఈ కేసు విచారణ సాగుతోందని హైకోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం కేసుని సీబీఐకి అప్పగించింది. 


సిట్ దూకుడు వల్లే కేసు సీబీఐ చేతికి వెళ్లిందా ?


దీనంతటికి కారణం సిట్‌ అత్యుత్సాహమే కారణమని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.  సీనియర్‌ పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ ఇప్పుడు సీబీఐ చేతుల్లోకి మారడానికి కారణం 41(A) సెక్షన్‌ కారణమని చెబుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార దుర్వినియోగంతో ఈ సెక్షన్‌  కింద నోటీసులు ఇవ్వడం వల్లే సిట్‌ విచారణ సరిగ్గా లేదని హైకోర్టు కూడా ఏకీభవించిందంటున్నారు న్యాయనిపుణులు. బీజేపీ సీనియర్‌ నేత బి ఎల్ సంతోష్‌ కి పోలీసులు ఇదే సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చారు. అయితే నిందితుడిగానూ, ఎఫ్‌ ఐఆర్‌ లోనూ తన పేరు లేనప్పుడు ఎలా 41(A) సెక్షన్‌ కింద నోటీసులు ఇస్తారని హైకోర్టు దృష్టికి తీసుకురావడం వల్లే న్యాయస్థానం కూడా ఏకీభవించిందని చెబుతున్నారు.  ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ సీబీఐ విచారణ కోరుతోంది. అయితే అంత కుముందే కెసిఆర్‌ రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టనీయకుండా జీవో జారీ చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఆదేశంతో సీబీఐ కేసుని తీసుకోవడమే కాకుండా నలుగురు బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. 


ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటున్న రోహిత్ రెడ్డి 


ఇప్పటికే ఈ కేసులో కీలక ఎమ్మెల్యే అయిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సీబీఐ కూడా కోనుగోళ్ల కేసు విషయంలో రోహిత్‌ రెడ్డిపైనే ఎక్కువగా గురి పెట్టే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ టార్గెట్‌ కూడా రోహిత్‌ రెడ్డినే. కాషాయాన్ని ఇరుకున పెట్టేలా కెసిఆర్‌ తీసిన సినిమా అని ఆరోపిస్తోన్న బీజేపీ ఇప్పుడు సీబీఐ ఎంట్రీతో ప్రజల ముందు నిర్దోషిగా నిరూపించుకోగలమన్న నమ్మకంతో ఉంది. 


డివిజన్ బెంచ్‌కు .. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం


మరోవైపు హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ  డివిజన్ బెంచ్‌కు తెలంగాణ సర్కార్ వెళ్లనుంది. అక్కడా ఎదురు దెబ్బ తగిలితే  సుప్రీంకోర్టులో సిట్‌ కేసు ఫైల్‌ చేసే అవకాశం కూడా ఉండవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు న్యాయనిపుణులు. హైకోర్టు తీర్పుతో అనేక ఊహాగానాలు, వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో అప్పుడే విమర్శులు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. కానీ ఈ పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏ రకంగా ఎదుర్కొంటారు, ఎటువంటి పావులు కదుపుతారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ కేసు కొనసాగుతూనే ఉంటుందా? లేక ఎన్నికల ముందే తేల్చేస్తారో చూడాలి.