Fact Check :  తెలంగాణలో ఇటీవల  బాగా హైలెట్ అయిన పేరు భైరి శ్రీనివాస్. అయ్యప్ప స్వామిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఆయన పై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయ దుమారం కూడా ప్రారంభమయింది.  భైరి  నరేష్ మొదట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారని.. ఆ తర్వాతే అలాంటి వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో ఒక్క సారిగా ప్రచారం గుప్పుమంది.  దీనిపై బండి సంజయ్ కార్యాలయం స్పందించింది. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  
 
కొన్ని వెబ్ సైట్లు ...కరీంనగర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్వేత హోటల్లో బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని బైరి నరేష్ కలిశాడంటూ... ఆ తరువాతే సదరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని  ప్రచురించాయి. ఇది  వైరల్ అయిపోయింది. దీనికి గురించి బండి సంజయ్ కార్యాలయాన్ని అనేక  సమంది వాకబు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఎంపీ బండి సంజయ్ కార్యాలయం సదరు వార్త పట్ల ఇప్పటికే తమకు సమాచారం అందిందని... అది పూర్తిగా అబద్ధం అంటూ కార్యాలయం వాటిని ఖండించింది. అబద్ధపు ప్రచారాలకు దిగుతున్న న్యూస్ వెబ్సైట్లపై త్వరలో న్యాయ నిపుణులను సంప్రదించి సైబర్ క్రైమ్ తో పాటు సాధారణ పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేస్తామని పేర్కొంది. 


పూర్తిగా కుట్రకు తెరలేపి ఒక వ్యక్తి తమ నాయకున్ని కలిశాడు అనేదానిపై ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో రాస్తూ ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. మరోవైపు బిజెపి ఐటీ సెల్ సైతం ఇప్పటికే దీనిపై తన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసింది. ఈ వార్తని ఖండిస్తూ  కాంగ్రెస్... బీఆర్ఎస్ పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలో భాగంగానే ఇలాంటి అసత్య ప్రచారాలను తెరమీదకి తెస్తున్నారని పేర్కొంది. ఇక మరోవైపు తమ పార్టీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రత్యేకమైన స్థలాలు కార్యాలయాలు ఉండగా తాము ఎందుకు గతంలో మంత్రికి చెందిన శ్వేతా హోటల్లో సమావేశం నిర్వహిస్తామని ఎదురు ప్రశ్న వేస్తోంది.


 అసలే రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్న ఈ తరుణంలో వివాదాస్పద వ్యక్తులను తమ నాయకులు కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఇక ఇదే అంశంలో మరో ఫోటో కూడా వైరల్ అవుతుంది... గతంలో నరేష్ ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్తో దిగిన ఫొటోను సైతం ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాలో విరివిగా వాడుతున్నాయి... ఓవైపు నరేష్ టీఆర్ఎస్ కి చెందిన కార్యకర్త అంటూ మొదట్లో ఫోటోలు విస్తృతంగా వైరల్ కాగా ఇప్పుడు ఈ వార్త సంచలనం కావడంతో సదరు వెబ్సైట్ పై కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు బిజెపి నేతలు. 


భైరి నరేష్  పేరుతో అన్ని పార్టీలూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మీ పార్టీ సానుభూతిపరుడంటే.. మీ పార్టీ సానుభూతిపరుడని  ఆరోపించుకుంటున్నారు.