Jagadish Reddy Responds on Bhatti comments: గత పేదళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారంటూ పదే పదే విమర్శిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంటర్‌ ఇచ్చారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క... పదే పదే  అప్పులు అప్పులు అంటూ పాడిందే  పాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడైనా... అప్పులు లేని రాష్ట్రాలు, విద్యుత్‌ సంస్థలు ఉన్నాయా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలు  అప్పులు, నష్టాల్లోనే ఉన్నాయని చెప్పారు జగదీష్‌రెడ్డి. మొన్నటి వరకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో కూడా విద్యుత్‌ సంస్థలు 89వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని  లెక్కలు చెప్పారు. ప్రభుత్వాన్ని నడపలేని మంత్రులు... గత ప్రభుత్వంపై విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. 


బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చి పాతిక రోజులపైనే అవుతోందన్న ఆయన...  ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. పథకాలు ఎపుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తుంటే అప్పులు అప్పులు అని పాడిందే పాడుతున్నారని మండిపడ్డారు.  అసెంబ్లీలో ఆర్థిక శాఖ, విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రాలు పెడితే... తాము సమాధానం చెప్పామని అన్నారు. అయినా.. మళ్లీ ఇవాళ డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు  భట్టి  విక్రమార్క అప్పులు అంటూ అవే అబద్ధాలు చెప్తున్నారని ఫైరయ్యారు. 


కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు జగదీష్‌రెడ్డి. తమ పాలనలో ప్రతీది అంకెలు రూపంలో తేటతెల్లంగా చెప్పేశామన్నారు. విద్యుత్‌ రంగంలో తాము  సాధించిన ప్రగతిని కూడా వివరంగా చెప్పామన్నారు. అప్పు లేని రాష్ట్రాలు దేశంలో లేవన్న జగదీష్‌రెడ్డి... దేశం కూడా అప్పుల్లోనే ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో  ఉన్నప్పుడు కూడా అప్పుల పాటే పాడిందని... అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాట పాడుతోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. దేశంలోని విద్యుత్  సంస్థలన్నీ అప్పులు, నష్టాల్లోనే ఉన్నాయని... ఆ విషయం కాంగ్రెస్‌ నేతలకు తెలీదా అంటూ ప్రశ్నించారు. అప్పు చేశామో.. ఏం చేశామో గానీ... ప్రజలకు కరెంటు కష్టాలు  లేకుండా చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని ఆరోపించారు.


కాంగ్రెస్‌ నేతలకు పాలన చేత కాక... ఏం చేయాలో తెలియక, పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు  జగదీష్‌రెడ్డి. మేనేజ్‌మెంట్‌ చేతకాక అప్పుల  గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014లో విద్యుత్ రంగంలో కాంగ్రెస్‌ మిగిల్చిపోయిన అప్పు 22 వేల కోట్లని గుర్తుచేశారు. అంత అప్పుపెట్టి కూడా రైతులకు 3గంటల  ఉచిత కరెంటు ఇవ్వలేక పోయారని అన్నారు. 2014లో మిగిల్చిపోయిన అప్పే... ప్రస్తుతం నాలుగు రెట్లు అయ్యిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసినా... కరెంటు  ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు అప్పుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు జగదీష్‌రెడ్డి. పాలన సాఫీగా సాగాలంటే అప్పు సాధారణ  విషయమని... పాలన చేత కాక పాడిందే పాడుతున్నారని పదేపదే విమర్శించారు. అప్పు తీర్చడం చేతకాక పోతే అప్పు తెచ్చిన సంస్థలకే విద్యుత్ సంస్థలను అప్పగించాలని  అన్నారు జగదీష్‌రెడ్డి. ఆ సంస్థలే నడుపుకుంటాయని సలహా ఇచ్చారు. 


ఇంకా ఎన్నిరోజులు కాంగ్రెస్ నేతలు అబద్దాలతో కాలం వెల్లదీస్తారని గట్టిగా ప్రశ్నించారాయన. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు సబ్ క్రిటికల్ టెక్నాలజీ గురించి భట్టి పదే పదే  మాట్లాడుతున్నారని.. సబ్ క్రిటికల్ టెక్నలజీతో ఇప్పటికే 30కి పైగా విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయని అన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీని మార్చుకోవచ్చని చట్టంలోనే ఉందని.. అదే తాము ఫాలో అయ్యామని చెప్పారు. గతంలో అసెంబ్లీలో ఇదే విషయాన్ని స్పష్టం చెప్పామన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేని సమస్యను  పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. 


లంకె బిందెలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారన్న మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి... రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌లో అధికారం పోగొట్టుకున్న కాంగ్రెస్.. లంకె బిందెలు అప్పజెప్పి పోయిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా లేనిలోటు కనిపిస్తోంది... తెలంగాణ ప్రజలు అప్పుడే చర్చించుకుంటున్నారని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులో అకౌంట్ నంబర్ ఇవ్వాలని ఎందుకు అడగలేదని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. 


మేడిగడ్డ దగ్గర మంత్రులు మంత్రుల్లా కాకుండా రౌడీల్లా మాట్లాడారంటూ ఘాటు విమర్శించారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. వారి తీరు అసెంబ్లీలోనూ అలాగే ఉంది... బయట కూడా అలాగే ఉంది అంటూ మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దిన ప్రభాకర్‌రావును అసెంబ్లీలో దుర్భాషలాడారని ఫైరయ్యారు. సభలో లేని వ్యక్తిపై నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డలో కూడా.. ఇలాగే అధికారులపై చిందులేశారని ఫైరయ్యారు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి. ఇంజినీర్లపై అమర్యాదగా ప్రవర్తించారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని... తాము నిజాయతీని నిరూపించుకునేందుకు ఇప్పటికే న్యాయ విచారణ కోరామన్నారు. కాంగ్రెస్ నాయకులకు పాలన చేత కాకపోతే ఆ విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పేయాలన్నారు. పదేపదే అప్పుల గురించి మాట్లాడటం మాని.... పాలనపై దృష్టి పెట్టాలని కౌంటర్‌ ఇచ్చారు జగదీష్‌రెడ్డి. అప్పులు అప్పులు అంటూ.... 24 గంటల కరెంటు ఇవ్వకుండా తప్పించుకొనేందుకు యత్నించే ఊరుకోమని హెచ్చరించారు.