APCID Notices To Kolikapudi Srinivas :  అమరావతి పరిరక్షణ సమితి నేత  కొలికపూడి శ్రీనివాసరావును అరెస్టు చేసేందుకు ఏపీసీఐడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసులు ఇచ్చారు. జనవరి మూడో తేదీన తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల కిందట డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు తన తలను తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తామన్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.  డీజీపీ ఈ ఫిర్యాదును సీఐడీకి సిఫారసు చేశారని తెలుస్తోంది. సీఐడీ అధికారులు వెంటనే కేసు నమోదు చేసి.. అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. 
 
సాధారణంగా సీఐడీ అంటే.. ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక కేసుల్ని మాత్రమే దర్యాప్తు  చేస్తుంది. ప్రతి చిన్నదానికి కేసుులు నమోదు చేసే అధికారం ఉండదు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు తమ పరిధిలో జరిగి నేరాలపై కేసులు నమోదు చేస్తాయి. అయితే ఈ కేసులో సీఐడీ ఎలా కేసు నమోదు చేసిందోనన్న సందేహం టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన  హైదరాబాద్ లో నివాసం ఉంటారు. రామ్ గోపాల్ వర్మ కూడా హైదరాబాద్  నివాసి. కానీ ఆయన హైదరాబాద్ పోలీసులకు  ఫిర్యాదు చేయకుండా నేరుగా  అమరావతికి వెళ్లి ఏపీ డీజీపీకి  ఫిర్యాదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేశారు. 


కేసు నమోదు చేయాలంటే.. నేర పరిధి అనేది ఉంటుందని.. ఈ వివాదంలో అసలు ఏపీకి సంబంధం ఏముందని.. కొలికపూడి తరపున్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడే ఉద్యమకారుడు. ఆమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ విధానాలను  విమర్శిస్తూంటారు. అందుకే ఆయనను రాజకీయ కుట్ర కోణంలోనే కేసులు పెట్టి అరెస్టు చేయాలనుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సీఐడీ అధికారుల తీరు ఇలాగే ఉంది. ఇటీవలే యశశ్వి అనే  ఎన్నారై విదేశాల నుంచి వస్తే..  అదుపులోకి తీసుకుని .. విజయవాడ తీసుకెళ్లి41ఏ నోటీసులు ఇచ్చి వదిలి పెట్టారు. నోటీసులు ఇవ్వడనికి ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందన్నదానిపై సీఐడీ నుంచి సమాధానం రాలేదు. 


సీఐడీని దాని అధికార పరిధిని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల వేటకు వినియోగిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. కొలికపూడి విషయంలోనూ అదే చేస్తున్నారు. నిజానికి వేరే రాష్ట్రం కేసును తమ రాష్ట్రంలో నమోదు చేయాలనుకోవడంలోనే అధికార పరిధి ఉల్లంఘించారని.. పైగా అరెస్టు చేయడానికి కూడా వెళ్లారన్న విమర్శఅలు వస్తున్నాయి.    ‘‘ఆంధ్రప్రదేశ్ అనే సమాజానికి, పంటకు పట్టిన చీడ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Verma ). ఆయన తల నరికి ఎవరైనా తెస్తే నేను కోటి రూపాయలు ఇస్తా’’ అంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ న్యూస్ చానల్ డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.