Kottu Satyanarayana : పేదలందరికీ భూమి పేరుతో రూ. 35,141 కోట్ల మేర దోపిడి జరిగిందని, ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. దీంతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ముందుగా పవన్ కల్యాణ్ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలన్నారు. రూ. 35 వేల కోట్ల కుంభకోణం జరిగిందనడానికి పవన్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు అసలు సిస్టమ్ అంటే ఏందో తెలియదన్నారు. చంద్రబాబు వద్ద ఉడిగం చేయడానికి పవన్ సిద్ధమయ్యారని విమర్శించారు.
ఇళ్ల స్థలాలు ఇచ్చింది జగనేనన్న మంత్రి
చంద్రబాబు హయాంలో అన్నీ స్కాములే జరిగాయని ఆరోపించారు. ఈ స్కాముల్లో పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఉందా? అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. పవన్ రాసిన లేఖపై మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ ఇంటర్‌పోల్‌తోనూ విచారణ జరిపించాలని అంటారేమోనన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా లక్షలాది మందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు రూ.35 వేల కోట్ల స్కామ్ అంటే తేలికైన విషయమని పవన్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
పవన్‌వి తింగరి మాటలు
కాపులు తనకు ఓట్లు వేయలేదని అని పవన్ కల్యాణ్ అంటున్నారని, అసలు ఆయనకు ఓట్లు వేసిన ఇతర వర్గాల వారూ లేరని విమర్శించారు. జనసేన అభ్యర్థులను గెలుపించుకోవాలనే ఆలోచన పవనకు లేదన్నారు. ఉదయం ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. సాయంత్రం చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకోవడమే పవన్‌కు తెలుసని ఎద్దేవా చేశారు. సభ్యత, సంస్కారం పవన్‌కు లేదని మండిపడ్డారు. పవన్ తింగరి మాటలు మాట్లాడటం మానుకోవాలని డిప్యూటీ సీఎం గట్టు సత్యనారాయణ హెచ్చరించారు.
మోదీకి పవన్ రాసిన లేఖలో ఏముందంటే ?
ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. దీనిపై సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని తన 5 పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. 'వైసీపీ పాలనలో భూ సేకరణ పేరిట రూ.32,141 కోట్లు దుర్వినియోగం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు భూ సేకరణలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సైతం లబ్ధిదారులకు పూర్తిగా ఇవ్వలేదు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తైతే 86,984 మందికే ఇళ్లు ఇచ్చారు. వీటన్నింటిపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.' అని లేఖలో కోరారు.