Bala Latha Comments On Smitha Sabharwal Post: ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) దివ్యాంగులపై చేసిన ట్విట్టర్ పోస్టుపై.. మాజీ బ్యూరోక్రాట్, ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాల లత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో స్మితా సభర్వాల్ పెట్టిన పోస్టు.. ఆమె వ్యక్తిగతమా.? లేక ప్రభుత్వ విధానమా.? అని ప్రశ్నించారు. ఆమె అభిప్రాయాలు దివ్యాంగులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. సీనియర్ అధికారిణి అయ్యి ఇలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తుల గురించి ట్వీట్ చేయడం విచారకరం అని పేర్కొన్నారు. స్మితా సభర్వాల్ ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్ ఫిట్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. 'స్మితా సభర్వాల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారు. దివ్యాంగులను దూరం పెట్టాలని స్మిత సభర్వాల్ చెబుతున్నారు. రేవంత్ సర్కారు తొలి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇచ్చింది. దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చట్టరీత్యా నేరం. ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఆమెపై సీఎం రేవంత్, సీఎస్ శాంతి కుమారి తగిన చర్యలు తీసుకోవాలి.' అని బాల లత డిమాండ్ చేశారు.


స్మితా సభర్వాల్‌కు సవాల్


'స్మితా సభర్వాల్ మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం' అంటూ బాల లత ఆమెకు సవాల్ విసిరారు. 'ఆమె ట్వీట్‌తో దివ్యాంగ సమాజం తీవ్ర అవమానానికి గురైంది. ఐఏఎస్ అధికారులకు అందం కాదు మానసిక సామర్థ్యం కావాలి. తెలంగాణలో చాలా మంది అధికారులకు పని లేకపోవడం వల్లే అనవసర విషయాలపై ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేని వారే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారనిపిస్తుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించాలి. ఆమె 24 గంటల్లోపు దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతాం. ఇలాంటి అధికారులు ఉండబట్టే నా ఉద్యోగాన్ని వదులుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకే హైదరాబాద్‌కు వచ్చాను. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులు సైతం స్పందించి స్మితా సభర్వాల్ వ్యాఖ్యలను ఖండించాలి.' అని పిలుపునిచ్చారు.


వివాదం రేపిన ట్వీట్ ఇదే!


'ఆలిండియా సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా అవసరమా.?' అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. పూజా ఖేడ్కర్‌ ఇష్యూపై స్పందించిన ఆమె తన వ్యక్తిగత ఎక్స్‌ ఖాతాలో.. 'ఈ చర్చ మరింత విస్తృతం అవుతున్న వేళ దివ్యాంగులను గౌరవిస్తూనే... విమానయాన సంస్థల్లో  పైలట్‌గా దివ్యాంగులను తీసుకుంటారా? అలాంటి వ్యక్తి సర్జన్‌గా ఉంటే మీరు ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉంటారా? ఆల్‌ ఇండియా సర్వీసులైనా ఐఏఎఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్ అంటేనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లాలి. గంటలు గంటలు పనిచేయాలి. ప్రయాణాలు చేయాలి. ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఓపికతో పాటు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇలాంటి వాటికి దివ్యాంగుల కోటా అవసరమా అని నేను అడుగుతున్నాను' అని ఓ పోస్టు పెట్టారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం స్మితా సభర్వాల్‌ ట్వీట్‌పై తీవ్ర అభ్యంతరం తెలిపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు.




Also Read: Smita Sabharwal : తగ్గేదే లేదంటున్న స్మితా సభర్వాల్ - సివిల్స్ డిసేబుల్ కోటాపై మరోసారి కామెంట్స్