Telangana News :  తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయంటూ కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందని  చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పడిపోవడానికి.. బీజేపీ బలమేమీ సెన్సెక్స్‌ కాదన్నారు.  తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు.


బీఆర్ఎస్‌తో కొట్లాడింది బీజేపీనే 


బీఆర్ఎస్‌తో కొట్లాడింది బీజేపీనేనని అన్నారు. మూడున్నరేళ్లలో బీజేపీ గెలిచిందని.. ఎక్కడో ఒక చోట అధికార దుర్వినియోగం, డబ్బులు, ప్రలోభాలతో బీఆర్ఎస్ గెలిచిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అన్నారు.   బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను, దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు.. కానీ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దేశంలో కుటుంబ పార్టీల వల్ల వాళ్ల కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. 


బీజేపీపై చేస్తున్న  కుట్రలను తిప్పి కొడతాం                                       


బీజేపీపై చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతామని తెలిపారు. మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకునే శక్తి తెలంగాణ  ప్రజలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉండటంతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి మద్దతు వెల్లువల వస్తుందని చెప్పారు. వరంగల్‌లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ సభను రాష్ట్రంలోని పార్టీ యంత్రాంగంతా కలిసి విజయవంతం చేస్తామని అన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంత చేస్తుందన్నారు.


బీజేపీ - బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందనే ప్రచారం                                 


ఇటీవలి కాలంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా విమర్శలు చోటు చేసుకోవడం లేదు. అదే  సమయంలో బీఆర్ఎస్ పై దూకుడుగా ఉండే బండి సంజయ్ ను మార్చడంతో  రెండు పార్టీల మధ్య  అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ఇదే ప్రచారం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు. బీజేపీకి మాత్ర ఈ ప్రచారం ఇబ్బందికరంగా మారింది. ప్రధాని మోదీ సభతో మొత్తం ఇలాంటి ప్రచారానికి బ్రేక్ వేస్తామనే ధీమాతో ఉన్నాయి.