Etala Rajedhar appeared before the Kaleshwaram Commission: భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరిగాయని వాటి నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు, ఇంజినీర్లు అందర్నీ కమిషన్ ప్రశ్నించింది. ఇప్పుడు  రాజకీయ నేతలను ప్రశ్నిస్తోంది. కాళేశ్వరం నిర్మిస్తున్న సమయంలో కొంత కాలం ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. తర్వాత ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీలో చేరారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు.

కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఆర్థిక మంత్రిగా ఈటల 

ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం ఆర్థిక వ్యవహారాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయాలు, ఇతర రూల్స్ పాటించకుండా ఎలా నిధులను విడుదల చేశారు.. అన్న అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ ఈటల రాజేందర్ నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ కు వ్యతిరేకంగా చెబుతారా.. అనుకూలంగా చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన తర్వాత ప్రత్యర్థిగా మారారు.  

కేసీఆర్ ను ఇరికించే స్టేట్ మెంట్ ఇస్తారా ?               

ఈటల నుంచి పార్టీ నుంచి పంపేయడానికి కేసీఆర్ తప్పుడు కేసులతో పాటు తప్పుడు ప్రచారం చేయించారని ఈటల ఆగ్రహంగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయే, వెళ్లగొట్టే పరిస్థితుల్ని సృష్టించడానికి ఈటల రాజేందర్ అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న కేసులు పెట్టారు. ఆయనకు చెందిన కోళ్ల ఫారాలు, వ్యాపారాలపై దాడులు జరిగాయి. తర్వాత పలు విషయాల్లో ఈటలను కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు టార్గెట్ చేశారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని కాళేశ్వరం విషయంలో అంతా కేసీఆరే చేశారని చెబుతారా లేకపోతే.. అక్కడ ఏమైనా జరిగి ఉంటే అది తనకు కూడా చుట్టుకుంటుందన్న ఉద్దేశంతో.. అంతా నిబంధనల ప్రకారమే చేశామని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.        

కాళేశ్వరంపై వ్యతిరేక వ్యాఖ్యలకు చేయని ఈటల                  

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటల రాజేందర్ ఇప్పటి వరకూ తీవ్రంగా విమర్శలు చేయలేదు. అవినీతి గురించి చెప్పలేదు. ఈ క్రమంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఏం చెబుతారన్నది బీజేపీ వర్గాలకూ ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో.. బీఆర్ఎస్ ను పొగుడుతున్నారు. కాంగ్రెస్ పాలన కన్నా బీఆర్ఎస్ పాలనే బాగుందని అంటున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్.. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం హైలెట్ అవుతోంది. హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా  విచారణకు హాజరు కావాల్సి ఉంది. పదకొండో తేదీన కేసీఆర్ హాజరవుతారు.