తెలంగాణ ఉద్యమ నేతగా.. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్‌పై విభేదాలు నేపథ్యంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో తిరిగి విజయం సాధించేందుకు చేస్తున్న సమీకరణాలు ఇప్పుడు మారుతున్నాయి. వాస్తవానికి ఉద్యమ నేతగా హుజూరాబాద్‌లో తనదైన శైలిలో ముందుకు సాగిన రాజేందర్‌.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ గూటికి చేరారు.




బీసీ నాయకుడిగా, ఉద్యమ సమయం నుంచి కరీంనగర్‌లో చేసిన ఆందోళనలు ఆయనకు తొలుత సానుభూతిని కల్పించాయి. దీంతోపాటు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ నుంచి కష్టపడిన ఈటలపై అకస్మాత్తుగా అవినీతి ఆరోపణలు చేయడం, వెనువెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో ఆయనపై సానుభూతి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరిన టైంలో టీఆర్‌ఎస్‌ కేడర్‌లో ఎక్కువ శాతం ఈటలతోపాటు బీజేపీలో చేరింది. ఎంపీపీలు, స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఈటలతోపాటే ఉన్నారు. అయితే ఆ తర్వాత కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహంతో సీన్ మార్చేశారని చెబుతున్నారు లోకల్ లీడర్స్. 


ప్రభుత్వ పథకాలు.. తాయిలాలు..


ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్‌ అక్కడ ఎలాగైనా పట్టు సాదించాలని, ఈటలతోపాటు పార్టీ మారిన వారిని తిరిగి టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేలా ప్లాన్ చేశారు. హుజూరాబాద్ యుద్ధానికి  ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. గ‌తంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని, గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వి క‌ట్టబెట్టారు. ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. పెద్ద స్థాయి నేత‌లు అయిపోయారు. ఇక మిగిలింది కిందిస్థాయి నేత‌లే. వీరికి కూడా హరీష్ రావు నేతృత్వంలో గులాబీ కండువాలు కప్పుతున్నారు. 




ట్రబుల్ షూటర్ గా పార్టీలో పేరున్న హ‌రీష్ రావు టీఆర్ఎస్ నుంచి  ఈటలతోపాటు బీజేపీలోకి వెళ్లిన వారికి బుజ్జగించి సొంత గూటికి చేర్చలో సఫలమవుతున్నట్లు సమాచారం. హుజూరాబాద్‌లో 37 వేల ఓటింగ్‌ కలిగిన దళితులను తమవైపు తిప్పుకునేందుకు దళిత బంధు పథకం ఏర్పాటు చేసి రూ.500 కోట్లు విడుదల చేయడం.. ఒక్కొ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నారు. బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న ఎస్సీలను తమవైపు తిప్పుకోవడంలో కేసీఆర్‌ సఫలం అవుతున్నారనే లోకల్ టాక్. 


ఈటల రాజేందర్‌ బీసీ అయినా ఆయన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం, ఈటల కుటుంబం ఇప్పుడు ఓసీలుగా మారిందనే ప్రచారం చేస్తోంది టీఆర్ఎస్. ఈటల నుంచి బీసీలను దూరం చేసే పనిలో పడింది. త్వరలో జ‌రిగే సీఎం కేసీఆర్ భారీ బ‌హిరంగ‌స‌భలో భారీగా హామీలు హుజూరాబాద్ నియోజ‌క‌ర్గానికి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ  నియోజకవర్గంలో బీజేపీకి స్వతాహాగా బలం లేకపోయినప్పటికీ ఈటెల రాజేందర్‌తోనే పార్టీ బలం పుంజుకుంది. ఆది నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు, సెక్యులర్‌ భావజాలం అధికంగా ఉంది. అయితే బీజేపీ పార్టీలో చేరినప్పటికీ తన సొంత క్రేజ్‌తోనే ముందుకు సాగేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇస్తున్న తాయిలాలు తన రాజీనామా వల్లే వచ్చాయని, అందువల్ల తనకే మరింత సానుభూతి కలుగుతుందనే భావనలో ఈటల ఉన్నారు. ఏది ఏమైనా హుజూర్‌బాద్‌లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ ఇస్తున్న తాయిలాలు ఏమేరకు సఫలీకృతం అయితాయో వేచి చూడాల్సిందే.