Eleti Maheshwar Reddy: తాజాగా కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరాడు. గురువారం కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పిన అనంతరం ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డాను కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చెందిన మరెంతో మంది నేతలు బీజేపీలో చేరుతారని చెప్పారు. తెలంగాణలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే అంటూ కామెంట్లు చేశారు.
కాంగ్రెస్ లో నాకన్నీ అనుమానాలు, అవమానాలే..!
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉందని ఎలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవర్టులు ఉన్నారని.. నేతలే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు ఎవరు, ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ చెప్పుకొచ్చారు. గంట లోపే బదులు ఇవ్వమంటూ నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరిగిందని... తనకు కాంగ్రెస్ లో నిత్యం అవమానాలు, అనుమానాలే ఎదురయ్యాయని చెప్పారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మరోవైపు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా కష్టపడి పని చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు అంతా కలిసి కట్టుగా పని చేసి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు చెందిన పెద్ద నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం తమకు చాలా సంతోషంగా ఉందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ తెలిపారు. ఆయన చేరికను స్వాగతిస్తున్నామని అన్నారు. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.