Electricity Bills Cant Paid Through Third Party Apps: విద్యుత్ వినియోగదారులకు నిజంగా ఇది బిగ్ అలర్ట్. ఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు కుదరవు. జులై నుంచి ఈ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు సాధ్యపడవు. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపేశాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 (సోమవారం) నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని డిస్కంలూ..
అటు, తెలుగు రాష్ట్రాల్లోని TGNPDCL, APSPDCL, APEPDCL, APCPDCL డిస్కంలదీ ఇదే పరిస్థితి. వీటి పరిధిలో బిల్లులు చెల్లించాలని ప్రయత్నిస్తే అవి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌కు రిజిస్టర్ కాలేదని చూపిస్తోంది. దీంతో థర్ట్ పార్టీ యాప్స్‌లో బిల్లుల చెల్లింపులు జరగక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. చెల్లింపులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఆయా విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని వినియోగదారులు డిస్కమ్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లోనే బిల్లులు చెల్లించాలి.
ఆర్బీఐ కీలక నిర్ణయం
కాగా, బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని బిల్లుల చెల్లింపులు కూడా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారానే జరగాలని ఆదేశించింది. ఇందులో భాగంగా జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలో బిల్లర్లు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంది. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ యాక్టివ్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు వినియోగదారుల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం వీలు పడవు.
Also Read: IPS Transfers: తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ, సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు