KCR Speech in Madhira: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు సచ్చేది కాదని, అనవసరంగా భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) ఓటు వేయొద్దని సీఎం కేసీఆర్ (KCR) వ్యాఖ్యానించారు. చింతకాని మండలం తనవల్లే బాగుపడిందని, అలాంటప్పుడు పట్టింపు లేని భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) ఓటు ఎందుకు వేయాలని అడిగారు. ఆ పార్టీకి 20 కంటే సీట్లు ఎక్కువ రావని అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా మధిర నియోజకవర్గంలో (Madhira Constituency) సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. దళిత వర్గం ఒక్కరు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయొద్దని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కమల్ రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. గతం కంటే మనకి ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రైతుబంధు ఇవ్వొద్దని, కరెంటు ఇవ్వొద్దని కాంగ్రెస్ అంటోందని విమర్శించారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట అని.. వాళ్లు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందని అన్నారు.