తెలంగాణకు మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు కీలక పోస్టులను కేంద్ర ఎన్నికల సంఘం భర్తీ చేసింది. ఈ రెండు ప్రధాన పోస్టుల్లో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒకటి. ఈ స్థానంలో దీర్ఘకాలిక సెలవులో ఉన్న టి. రవి కిరణ్ స్థానంలో ఐపీఎస్ అధికారి డీఎస్ లోకేష్ కుమార్‌ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసస్ గా నియమించారు. జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి బుధవారం (జూన్ 28) లేఖ రాసింది.
ఐపీఎస్ అధికారి డీఎస్ లోకేష్ కుమార్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా ఐఏఎస్ వికాస్ రాజ్ కొనసాగుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత అసెంబ్లీ గడువు తేదీ డిసెంబర్ ఏడో తేది వరకూ ఉంది. కాబట్టి, ఆ లోగానే ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెల్లడి కావాల్సి ఉంటుంది. దీంతో నవంబర్ లో ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి రాష్ట్రంలో ఇటీవల మూడు రోజుల పాటు పర్యటించిన ఎన్నికల కమిషన్ బృందం ఉన్నతాధికారులతో వరుసగా భేటీలు నిర్వహించింది. సమయం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించించింది.