Delhi Liquor Case :  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈ నెల 20 వ తేదిన విచార‌ణ‌కు రావ‌ల‌సిందిగా ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు స్వ‌యంగా హాజ‌రుకావ‌ల‌సిందిగా పేర్కొంది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని విచారణ పూర్తయ్యాకే వస్తానని చెప్పి లాయర్‌తో లేఖ  పంపించారు. తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. కవిత ఈడీ విచారణకు  హాజరవ్వాల్సి ఉండటంతో మంత్రులు హరీష్ రావు, కవిత ఢిల్లీ వెళ్లారు. వారు కూడా కవితో పాటు హైదరాబాద్ తిరుగు పయనం అయ్యారు. 


కవిత విచారణకు హాజరు కాకపోవడంతో  పిళ్లై రిమాండ్ పొడిగింపు


మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బినామీగా ఈడీ ఆరోపిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో కోర్టులో పిళ్లైను ప్రవేశ పెట్టిన  ఈడీ  అధికారులు కస్టడీ పొడిగించాలని కోరారు. ఈ కేసులో కవిత అనుమానితురాలని.. ఆమెతో కలిసి పిళ్లైను విచారించాల్సి ఉందన్నారు. అయితే  కవిత విచారణకు రాలేదని తెలిపారు. కవిత తన ప్రతినిధి ద్వారా డాక్యుమెంట్స్ పంపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 


సౌత్ గ్రూప్‌ లో కవిత , మాగుంటలను ప్రశ్నించడమే పెండింగ్ 


 నిందితులను ఎదురు ఎదురుగా విచారణ జరపడం చాలా ఎఫెక్టివ్ పద్దతన్నారు. ఈ సందర్బంలో ఈడీ కూడా  కవితకు మరోసారి నోటీసులు జారీ చేశామని కలిపి విచారణ  జరపుతామని పిళ్లై కస్టడీని పొడిగించారని కోరారు. సౌత్ గ్రూప్‌లో ఇంకా మాగుంట శ్రీనివాసులరెడ్డి, కవితను ప్రశ్నించాల్సి ఉందని  వారిని ప్రశ్నిస్తే సౌత్ గ్రూప్ గురించి విచారణ పూర్తవుతుందన్నారు.  దీంతో కోర్టు మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది. 


కవితపై క్ష పూరితంగా కేసులు పెట్టారన్న లాయర్               


కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించిందన్నారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలన్నారు.  అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లామని.. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే విచారణకు వస్తామన్నారు. 


20వ తేదీన కవిత  హాజరవుతారా ?


కవిత లాయర్ తాజాగా ప్రకటించిన  దాని ప్రకారం 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాతనే కవిత ఈడీ విచారణకు   హాజరయ్యే అంశంపై స్పందిస్తారు. ఆలోపు విచారణకు హాజరు కారు. అయితే ఈ లోపే అంటే 20వ తేదీనే హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే..  సుప్రీంకోర్టు విచారణకు ముందే హాజరు కావాల్సి ఉంటుంది. మరి కవిత హాజరవుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఒక వేళ హాజరు కాకపోతే విచారణకు సహకరించడం లేదన్న కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకునే  అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.