తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) కథానాయకుడిగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా 'లియో'. 'మాస్టర్' తర్వాత మరోసారి వాళ్ళు ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. 'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ చేస్తున్న సినిమా కూడా ఇదే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు.
విజయ్ జోడీగా త్రిష... 14 ఏళ్ళ తర్వాత!
దళపతి 67... 'లియో'లో విజయ్ జోడీగా త్రిష నటిస్తున్నారనే ఈ న్యూస్ ఎప్పుడో బయటకు వచ్చింది. యూనిట్ అధికారికంగా వెల్లడించడానికి ముందు తమిళ మీడియాకు తెలిసింది. తమిళంలో విజయ్, త్రిషది సూపర్ డూపర్ హిట్ జోడీ. సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఒక్కడు' తమిళ రీమేక్ 'గిల్లి' సహా 'కురివి', 'తిరుప్పాచ్చి', 'అతి' సినిమాల్లో ఈ జోడీ నటించింది. సుమారు 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ జంటగా విజయ్, త్రిష కనిపించనున్నారు. అయితే... దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫస్ట్ ఛాయస్ త్రిష కాదట.
సాయి పల్లవి 'నో' చెప్పడంతో...
'లియో'లో కథానాయియికగా సాయి పల్లవిని తీసుకోవాలని లోకేష్ కనగరాజ్ ట్రై చేశారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఆమెకు కథ కూడా చెప్పారట. అయితే, సాయి పల్లవి నో చెప్పారట. సినిమాల ఎంపికలో ఆమె ఆచితూచి వ్యవహరిస్తారు. కమర్షియల్ సినిమాలకు, హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యం ఉన్న సినిమాలకు ఆమె కొంచెం దూరంగా ఉంటారు. హీరోయిన్ క్యారెక్టర్ నచ్చక నో చెప్పారో? లేదంటే రామాయణం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో సీత క్యారెక్టర్ కోసం ప్రిపేర్ కావడానికి నో చెప్పారో? మొత్తం మీద సినిమా చేయనని చెప్పేశారట. దాంతో ఆ ఆఫర్ త్రిషకు వచ్చిందని టాక్.
Also Read : ఆనందంతో ఏడ్చిన కీరవాణి - ఆస్కార్‌ను మించిన గిఫ్ట్
'లియో' చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. 'మాస్టర్', 'వారసుడు' తర్వాత విజయ్ హీరోగా ఆ సంస్థ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. ఇది విజయ్ 67వ సినిమా. అందుకని, 'దళపతి 67' (Thalapathy 67) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. లోకేష్ కానగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో 'దళపతి 67' కూడా ఒకటి. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్', సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్లు, విజయ్ క్యారెక్టర్... అన్నీ ఈ కథలో భాగమే. డ్రగ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్లు చుట్టూ కథ తిరుగుతుంది.
Also Read : శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు నటిస్తున్న 'లియో' సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' తర్వాత మరోసారి విజయ్ సినిమాకు ఆయన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రామ్ కుమార్ బాలసుబ్రమణియన్, సహా నిర్మాత : జగదీష్ పళనిసామి.