రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన ప్రతి పని నెటిజన్లకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా. తాజాగా వర్మకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే? డిగ్రీ పూర్తయ్యాక 37 ఏళ్లకు ఆయన సర్టిఫికేట్ అందుకున్నారు. ఎవరైనా డిగ్రీ పాస్ కాగానే సర్టిఫికేట్ తీసుకుంటారు. కానీ, అలా తీసుకుంటే వర్మ ఎందుకు అవుతారు? తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  అకాడమిక్ ఎగ్జిబిషన్‌కి వర్మ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ఆయనను సన్మానించారు. అదే సమయంలో బీటెక్ డిగ్రీ పట్టాని అందించి ఆశ్చర్యపరిచారు. ఈ పట్టాను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో వర్మ పంచుకున్నారు.






1987లో డిగ్రీ పూర్తి చేసిన ఆర్జీవీ


నిజానికి ఆర్జీవీ సినిమాల్లోకి రాకముందు బీటెక్ చదివారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ చేశారు. అయితే, తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించే వారు. చదివాం అంటే చదివాం అన్నట్లు బీటెక్ కంప్లీట్ చేశారు. చివరకు మోస్తారు మార్కులతో బయటపడ్డారు. పాసయ్యాక కనీసం డిగ్రీ పట్టా కూడా తీసుకోలేదు. 1985లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఇన్నాళ్లకు  పట్టా తీసుకున్నారు.  అంతేకాదు, తనకు సివిల్ ఇంజినీరింగ్ చేయడం ఇష్టంలేక పెద్దగా పట్టించుకోలేదన్నారు.  తాజాగా తన సర్టిఫికేట్ ను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “నేను పాసైన 37 సంవత్సరాల తర్వాత బిటెక్ డిగ్రీ పట్టా అందుకోవడం సూపర్ థ్రిల్ గా ఉంది. 1985లో పాసైనా అప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే, సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయడం నాకు పెద్దగా ఇష్టం లేదు. థ్యాంక్యూ నాగార్జున యూనివర్సిటీ” అంటూ వర్మ ట్వీట్ చేశారు. వర్మ సెకెండ్ క్లాస్ లో పాసైనట్లు సర్టిఫికేట్ లో కనిపిస్తోంది.


నేను చెడగొట్టడానికి ప్రయత్నించా, వాళ్లే  చెడగొట్టారు- వర్మ


అటు తన డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తో కూర్చుని మాట్లాడుతున్న ఫోటోను, అకాడమిక్ ఎగ్జిబిషన్‌ సందర్భంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్న ఫోటోను షేర్ చేశారు. “నేను వాళ్లను చెడగొట్టడానికి ట్రై చేశాను. కానీ, వాళ్లే నన్ను చెడగొట్టారు” అంటూ కామెంట్ చేశారు.  ప్రస్తుతం వర్మ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘నువ్ సివిల్ ఇంజినీరింగ్ చేశావా? అందుకే నీ సినిమాల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగులను ఎక్కువగా చూపిస్తావ్? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  నేను సెకెండ్ క్లాస్ లో పాసయ్యా, మీ మాదిరిగానే డైరెక్టర్ కావాలనుకుంటున్నాం అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.


















Read Also: ఆ రెండు పనులతో రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేశారు: రామ్ గోపాల్ వర్మ