ED has released an official statement on Kavitha arrest : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిఃవరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.
ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించాని ప్రకటనలో తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని ప్రకటనలో తెలిపింది.
కేటీఆర్, హరీష్ రావు ములాఖత్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ములాఖత్‌లో భాగంగా వీరిద్దరు కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. కవితను ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. మరోవైపు కవితతో ములాఖత్ కోసం భర్త అనిల్ రాలేదు. ఆయనకూ ఈడీ నోటీులు జారీ చేసింది. తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. పది రోజుల వరకు ఈడీ కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అందుబాటులో ఉండి ఈడీ విచారణక హాజరు కాలేదన్న అభిప్రాయం వస్తందనే ఆయన ములాఖత్‌కు దూరంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఈడీపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
దర్యాప్తు సంస్థ ఈడీపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీం కోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరుగుతుండగానే, అదే కేసులో తనను అరెస్టు చేశారని ఆమె ప్రస్తావించారు. తనను అరెస్ట్ చేయబోమంటూ గతంలో సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు తెలిపారని, సర్వోన్నత న్యాయస్థానానికి మాటిచ్చి తప్పారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అన్నారు కవిత. ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 19వ తేదీన ఆమె పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.