ED has also registered a case in Telangana IGST scam : తెలంగాణలో వెలుగు చూసిన ఐజీఎస్టీ స్కాంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్,  ఏ 5గా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ను సీసీఎస్ పోలీససుులు నమోదు చేశారు. ఇందులో అక్రమ నగదు చెలామణి జరిగినట్లుగా తేల్చడంతో ఈడీ కేసు పెట్టింది. 


ప్రభుత్వం మారిన తరవాత వెలుగులోకి వచ్చిన జీఎస్టీ స్కాం                   


ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సీసీఎస్‌ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  బోగస్‌ ఇన్వాయిస్‌లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ను క్లెయిమ్‌ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించింది. ఈ కేసులో  వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని అధికారులు గుర్తించారు.   ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్‌ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించింది. 


సోమేష్ కుమారే స్కాంలో కీలకంగా వ్యవహరించారని సీఐడీ అనుమానం                       


సోమేశ్‌కుమార్‌ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించామని నిందితులుగా ఉన్న కాశీవిశ్వేశ్వరరావు, శివరామప్రసాద్‌ అంగీకరించినట్లు సీసీఎస్‌ పోలీసులు గతంలో తెలిపారు.  ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేశ్‌కుమార్‌ ‘స్పెషల్‌ ఇనిషియేటివ్స్‌’ పేరిట ఒక వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని  సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని  సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేల్చారు. సోమేష్ సహకారంతో 75 సంస్థలకు సంబంధించిన ఐటీ రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్ వేర్ ను మార్చారు.  తద్వారా ఐటీసీ క్లెయిమ్‌లకు వీలు కల్పించి రూ.1400 కోట్ల వరకు ఐటీసీ సొమ్మును అడ్డదారుల్లో క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశంకల్పించారు.           


ఈడీ కేసుతో సోమేష్‌కు మరిన్ని చిక్కులు                  


ఒక్క తెలంగాణ బేవరెజెస్‌ కార్పొరేషన్‌కు సంబంధించినదే రూ.1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్‌ చేసినట్లు గుర్తించారు. మరో 11 సంస్థలకు సంబంధించి రూ.400 కోట్ల ఐటీసీ సొమ్మును క్లెయిమ్‌ చేసినట్లు తేలిననట్లగా తెలుస్తోంది.  కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్‌ కనుసన్నల్లోనే నడిచినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.  సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు ఇప్పటికే  నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది.