Forbes Richest Billionaires 2024: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ (Reliance Industries Chairman Mukesh Ambani) అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో మరోసారి టాప్‌ ర్యాంక్‌లో నిలిచారు. ఫోర్బ్స్ 2024 రిపోర్ట్‌ ప్రకారం, గత ఏడాది కాలంలో ఆయన సంపద $27.5 బిలియన్లు పెరిగింది. అంబానీ ఆస్తిపాస్తుల విలువ (Mukesh Ambani Net Worth) ఇప్పుడు $119.5 బిలియన్లకు చేరింది. ముకేష్‌ అంబానీ భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తిగా మాత్రమే కాదు, 2024లో ప్రపంచవ్యాప్తంగా డాలర్ పరంగా అతి పెద్ద లాభం పొందిన రెండో వ్యక్తి కూడా. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అంబానీ 13వ అత్యంత సంపన్న వ్యక్తి.


విశేషం ఏంటంటే, 2024 లిస్ట్‌లో, భారత్‌లో అంబానీ కంటే ఎక్కువ లాభం పొందిన వ్యక్తి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Adani Group Chairman Gautam Adani). గత ఏడాది కాలంలో ఆయన సంపద $48 బిలియన్లు పెరిగి $116 బిలియన్లకు (Gautam Adani Net Worth) చేరుకుంది. 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదం తర్వాత అదానీ సంపద గణనీయంగా రికవర్‌ అయింది. 


$1 ట్రిలియన్ మార్క్‌ దాటిన పారిశ్రామికవేత్తలు
మన దేశంలోని టాప్‌-100 ధనవంతులు ఈ సంవత్సరం ఒక మైలురాయిని దాటారు. ఫోర్బ్స్ ప్రకారం, తొలి 100 మంది సంపన్నుల ఉమ్మడి సంపద $1.1 ట్రిలియన్‌లకు చేరుకుంది. 2023లోని $799 బిలియన్ల నుంచి ఇది 40 శాతం పెరిగింది. ఈ వృద్ధికి స్టాక్ మార్కెట్ల బలమైన పనితీరు కారణం. BSE సెన్సెక్స్ గత 12 నెలల్లో 30 శాతం పెరిగింది.


OP జిందాల్ గ్రూపునకు చెందిన సావిత్రి జిందాల్ $43.7 బిలియన్ల ఆస్తితో థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఇది, గత సంవత్సరం కంటే $19.7 బిలియన్లు పెరిగింది. టెక్నాలజీ కింగ్‌ శివ్ నాడార్ $40.2 బిలియన్ల నికర విలువతో ఫోర్త్‌ ర్యాంక్‌లో ఉన్నారు.


సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దిలీప్ షాంఘ్వీ (Dilip Shanghvi) దేశంలో ఐదో అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ 2023లోని $19 బిలియన్ల నుంచి ఇప్పుడు $32.4 బిలియన్లకు పెరిగింది. 


2024 ఫోర్బ్స్ జాబితాలో నలుగురు కొత్త వ్యక్తులు
భారతదేశ బిలియనీర్స్‌ లిస్ట్‌లో నాలుగు కొత్త పేర్లు కనిపించాయి. వారిలో.. హెటెరో ల్యాబ్స్ వ్యవస్థాపకుడు బి పార్థసారధి రెడ్డి (B Partha Saradhi Reddy) $3.95 బిలియన్ల సంపదతో 81వ స్థానంలోకి అడుగు పెట్టారు. బయోలాజికల్ Eకి చెందిన మహిమా దాట్ల (Mahima Datla) $3.3 బిలియన్లతో 100వ స్థానంలో నిలిచారు. షాహీ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన హరీష్ అహుజా, ప్రీమియర్ ఎనర్జీస్‌కు చెందిన సురేందర్ సలూజా కూడా కొత్త వ్యక్తుల లిస్ట్‌లో ఉన్నారు.


ఫోర్బ్స్ జాబితాలోకి తీసుకోవడానికి కటాఫ్ 2023లోని $2.3 బిలియన్ల నుంచి ఈ ఏడాది $3.3 బిలియన్లకు పెరిగింది. ఈ మార్పు వల్ల, గత లిస్ట్‌లో ఉన్న 11 మంది బిలియనీర్లు ఇప్పుడు వైదొలిగారు.


భారతదేశంలోని టాప్ 10 సంపన్నులు:


1. ముఖేష్ అంబానీ ----  $119.5 బిలియన్లు


2. గౌతమ్ అదానీ ----  $116 బిలియన్లు


3. సావిత్రి జిందాల్ ----  $43.7 బిలియన్లు


4. శివ్ నాడార్ ----  $40.2 బిలియన్లు


5. దిలీప్ షాంఘ్వీ ----  $32.4 బిలియన్లు


6. రాధాకిషన్ దమానీ ----  $31.5 బిలియన్లు


7. సునీల్ మిత్తల్‌ ----  $30.7 బిలియన్లు


8. కుమార్‌ మంగళం బిర్లా ----  $24.8 బిలియన్లు


9. సైరస్ పూనావాలా ----  $24.5 బిలియన్లు


10. బజాజ్ కుటుంబం ----  $23.4 బిలియన్లు


మరో ఆసక్తికర కథనం:  మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ మధ్య ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు - భారీగా పెరిగిన బంధన్‌ బ్యాంక్‌