Ravan Dahan: ఏటా ఆశ్వయుజమాసంలో శుక్ల పక్షంలో వచ్చే పదో రోజున దసరా వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజునే విజయ దశమి అంటారు. 
పురాణాల ప్రకారం దుర్గాదేవి ఈ రోజు  మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది. ఇదే రోజు పాండవులు ఉత్తర గో గ్రహణ యుద్ధంలో విజయం సాధించారు. ఇదే రోజు శ్రీ రాముడు లంకాధిపతి అయిన రావణుడిని సంహరించాడు.


విజయ దశమి రోజు ఆయుధ పూజ చేస్తారు..దేశవ్యాప్తంగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల దిష్టిబొమ్మలు దహనం చేస్తారు. దసరా రోజు రావణ దహనం ఎందుకు చేస్తారు? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి?


తనది కాని వాటిని ఆశించేవారు, పరస్త్రీ వ్యామోహంలో పడేవారు, స్త్రీని వేధింపులకు గురిచేసేవారు పాపం పండి దహించుకుపోతారన్నదే రావణ దహన వేడుకల వెనుకున్న సందేశం. 


Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!


ఇంతకీ రావణుడు మంచివాడా  - చెడ్డవాడా?... ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మీకు రావణుడి గురించి కొన్ని విషయాలు తెలియాలి..
 
రావణుడి తండ్రి  విశ్వ వసు బ్రహ్మ  - ఈయన బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు
రావణుడి తల్లి కైకసి - ఈమె రాక్షస వంశానికి చెందిన సుమాలి కుమార్తె


విశ్వావసు మొదటి భార్య  వరవర్ణినికి పుట్టినవాడు కుబేరుడు.
రెండో భార్య కైకసికి జన్మించిన వారు .. రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు


రావణుడికి చిన్నప్పటి నుంచీ ఏ మూలనా సాత్విక స్వభావం ఉండేది కాదు. తండ్రి నుంచి వేదాలు, తాత నుంచి పాలన నేర్చుకున్నా కానీ సర్వలోకాలను వశం చేసుకోవాలనే కాంక్షతో తపస్సు ఆచరిస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు అమరత్వం అడుగుతాడు..అది కుదరదు అనడంతో తనకు రాక్షసులు, దేవతలు, సర్పాలు, పక్షులు, పిశాచాల ద్వారా మృత్యువు రాకూడదనే వరం కోరుతాడు. అందుకే శ్రీ మహావిష్ణువు సాధారణ మానవుడిలా రాముడిగా జన్మించి రావణ సంహారం చేశాడు 


రావణుడి అసలు పేరు దశగ్రీవుడు..ఓసారి కైలాస పర్వతాన్ని పైకెత్తేందుకు ప్రయత్నించగా శివుడు కాలివేలుతో పర్వతాన్ని కిందకు నొక్కుతాడు. ఆ కింద చేయి ఉండిపోవడంతో నొప్పితో గట్టిగా ఆర్తనాదం చేస్తాడు. రావణ అంటే గట్టిగా అరుస్తున్న వ్యక్తి అని అర్థం..అప్పటి నుంచి ఆ పేరు స్థిరపడిపోయింది. 


రావణుడు గొప్ప శివభక్తుడు మాత్రమే కాదు..శివతాండవ స్తోత్రం రచించినది కూడా రావణుడే..


రావణుడి చేతిలో ఇక్ష్వాకు వంశానికి చెందిన అనారణ్య అనే రాజు మరణిస్తాడు..ఆ సమయంలో నా వంశంలో జన్మించిన వ్యక్తి చేతిలోనే నీ చావు అనే శాపం ఇస్తాడు.  ఇక్ష్యాకు వంశంలోనే జన్మించిన రాముడి చేతిలో రావణుడి మరణం ఈ శాపంలో భాగమే 


ఎవరితో పోటీ పడాలో ఎవరితో పోటీ పడకూడదో తెలుసుకోకుండా రంగంలోకి దిగే స్వభావం. వాలి, మాంధాత చేతిలో అలానే ఓటమిపాలవుతాడు రావణుడు. ఇక వాలి బలం తెలుసుకుని తనతో స్నేహం చేస్తాడు.
 
బ్రాహ్మణుడు అయిన తండ్రి నుంచి వేదం, ముహూర్తం నేర్చుకున్న దశగ్రీవుడు.. రామ-రావణ యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాడు. అంటే తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకున్నాడన్నమాట. ఇక్కడ తన వృత్తి ధర్మాన్ని వీడలేదు రావణుడు. 


వేదాలు, ముహూర్తాలు నిర్ణయించడంలోనే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ రావణుడు నిపుణుడు. తన కుమారుడు మేఘనాథుడు జన్మించినప్పుడు అన్ని గ్రహాలను తగిన స్థితిలో ఉండాలని ఆదేశించాడు రావణుడు...ఆ సమయంలో శని అకాస్మత్తుగా తన స్థానం మార్చుకోవడంతో ఆగ్రహించి శనిపై దాడి చేస్తాడు రావణుడు.


యుద్ధంలో తాను మరణించాలంటే నాభివద్ద కొట్టాలని సోదరుడికి తన మృత్యువు రహస్యం చెప్పిందీ రావణుడే.. 
 
మరణానికి చేరువలో ఉన్న రావణుడి వద్దకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోమని రాముడు..లక్ష్మణుడిని పంపిస్తాడు. ఆ సమయంలో రావణుడు చెప్పిన విషయాలివే..
 
రథ సారథి, పాలవాడు, వంటవాడు, సోదరులతో ఎప్పుడూ స్నేహంగా ఉండాలి...వారితో శత్రుత్వం అత్యంత ప్రమాదకరం


మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిని నమ్మాలి కానీ..మనల్ని అనునిత్యం పొగిడే వారిని నమ్మవద్దు


విజయం ఎప్పుడూ నిన్నే వరిస్తుందని అనుకోవడం భ్రమ..శత్రువు చిన్నవాడు అయినా తక్కువ అంచనా వేయవద్దు. హనుమంతుడు కోతే కదా అని తక్కువ అంచనా వేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నానని చెప్పాడు.


యుద్ధంలో గెలవాలి అనే కాంక్ష ఉండాలి కానీ..అత్యాశ ఉండకూడదు. సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం వరిస్తుంది.


Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!