HMDA Balakrishna Case :  HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించాడు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేసినట్లుగా అంగీకరించారని అంటున్నారు. 


అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు. నార్సింగిలోని ఎస్ఎస్వీ ప్రాజెక్ట్ అనుమతి కోసం అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని బాలకృష్ణ పేర్కొన్నాడు. రూ. 10 కోట్లలో కోటి రూపాయలను షేక్ సైదా ఇచ్చినట్లు బాలకృష్ణ తెలిపాడు. డిసెంబర్ లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు చేరింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చాడని..  మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం అరవింద్ కుమార్ కోటి రూపాయలు డిమాండ్ చేసాడని వెల్లడించినట్లుగా ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. 


 మహేశ్వరం మండల్ మంకల్ వద్ద వర్టేక్స్ భూములకు సంబంధించిన వ్యవహరంలో అరవింద్ కుమార్ ఫేవర్ చేసాడని బాలకృష్ణ తెలిపాడు. ఫలితంగా వర్ టెక్స్ హోమ్స్ లో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో శివబాలకృష్ణ ఫోన్ ను సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. ఐఏఎస్ అధికారితో చేసిన చాట్స్, కాల్ రికార్డ్స్ వివరాలను ఏసీబీ అధికారులు వెలికి తీస్తున్నారు. ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెప్పిన ఫైళ్లను వెంటనే క్లియర్ చేసినట్టు స్టేట్ మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.  కస్టడీలో శివబాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను ఏసీబీ విచారించే అవకాశం ఉంది.                               


మరో వైపు  శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక అంచనా. ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లు తేలింది. శివబాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. మరోవైపు మూడు రోజులపాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు బాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది.