Drug Control dg Comments: మెడికల్ షాపు నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మెడిసిన్స్ విక్రయించాలని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి (Kamalasan Reddy) స్ఫష్టం చేశారు. తెలంగాణలో (Telangana) డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ పక్కాగా అమలు చేస్తున్నామని.. ప్రజలకు నాణ్యమైన మందులు సరఫరా అయ్యేలా చూడడం తమ బాధ్యతని చెప్పారు. దేశంలో పలు చోట్ల నకిలీ మెడిసిన్స్ తయారు చేసి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించామని.. గత 6 నెలల్లో అలాంటి వాటిపై నిఘా పెంచామని చెప్పారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నకిలీ మెడిసిన్ ఇంజక్షన్స్ సీజ్ చేశామని అన్నారు.


ప్రత్యేక వెబ్ సైట్


ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్, ఏజెంట్ల ద్వారా నకిలీ మెడిసిన్స్ హైదరాబాద్ కు దిగుమతి చేస్తున్నారని డీజీ వివరించారు. రాష్ట్రంలో 42 వేల మందుల షాపులు ఉన్నాయని.. నకిలీ మందులు తక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని షాపులపైనా ప్రత్యేక నిఘా ఉంచామని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రజలకు మెడిసిన్స్ విక్రయించాలని స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు రవాణా ద్వారా కొరియర్ చేస్తోన్న ముఠాలను పట్టుకున్నామని.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ కు సంబంధించి ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించినట్లు పేర్కొన్నారు.


ప్రజలకు సూచన


ప్రజలు నకిలీ మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడైనా అలాంటి మెడిసిన్స్ గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీజీ సూచించారు. తక్కువ ధరకే మందులు ఇస్తున్నారని.. డిస్కౌంట్ల పేరుతో మోసపోవద్దని చెప్పారు. నకిలీ ఔషధాలపై 1800-599-6969 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.


Also Read: Karimnagar Politics: కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎవరికి? ఈసారీ త్రిముఖ పోటీనే!