Drones For Agriculture: అన్నదాతల బాగు కోసం, వారి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తోంది. ముఖ్యంగా రైతులను ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ పథకం రెండో దశలో భాగంగా రూ.1,500 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఈక్రమంలోనే 50 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాల పంపిణీకి వనపర్తి, వరంగల్ జిల్లాల్లో రూ.75 కోట్లతో రెండు పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇది విజయవంతం అయితే అన్ని జిల్లాలకు విస్తరించాలని చూస్తోంది. యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ సంవత్సరం నుంచి సబ్సిడీపై డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం మొదటి దశను 2016 నుంచి 2018 వరకు చేపట్టిన తెలంగాణ సర్కారు 6 లక్షల 66 వేల 221 మంది రైతులకు రూ.951.28 కోట్ల సబ్సిడీతో పలు యంత్రాలను అందజేశారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను రైతులకు అందజేసింది. అనంతరం నిధుల కొరత వల్ల పథకం పూర్తిగా నిలిచిపోయింది.
కాగా సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు యంత్రాల వాడకం మరింత పెరిగింది. అన్నదాతల్లో 37 శాతం మంది యంత్ర పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో యంత్ర పరికరాల పంపిణీపై దృష్టి సారించింది. ఈ పథకానికి ఈ ఏడాది జిల్లాకు రూ.50 కోట్లను వెచ్చించాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. పరికరాల కొనుగోలుకు 50 శాతం ప్రభుత్వం చెల్లిస్తే మిగిలిన 50 శాతం రైతులు భరించాలి. ముందుగా ఆయా జిల్లాల్లో వ్యవసాయ యంత్రాలు, పరికరాల ప్రదర్శన చేపట్టి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులను గుర్తించి.. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వర్తింపజేస్తారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ పథకం కింద వ్యవసాయ యంత్ర, పరికరాల ప్రదర్శన నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. త్వరలో వనపర్తిలోనూ రైతులను ఎంపిక చేయబోతున్నారు. అనంతరం మిగిలిన జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
డ్రోన్లపైన ప్రత్యేక దృష్టి..
తెలంగాణలో రైతులు ఇతర పరికరాలతో పాటు డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. పురుగుల మందు పిచికారీకి డ్రోన్లను విపరీతంగా వాడుతున్నారు. పంటలకు చీడ పురుగులు ఏమైనా పట్టాని అని తెలుసుకునేందుకు కూడా వీటిని వాడుతున్నారు. ఈ క్రమంలోనే పంటల్ని ఫొటోలు తీయడం, వాటిని వ్యవసాయ అధికారులకు పంపించడం వంటివి చేస్తున్నారు. పూత, కాత, దిగుబడి అంచనాలను క్షేత్ర స్థాయిలో సూక్ష్మంగా పరిశీలిస్తూ.. పర్యవేక్షించేందుకు వీలుగా డ్రోన్లను అందుబాటులోకి తీసుకు రావాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. డ్రోన్ల విలువ ఎక్కువగా ఉండడం వల్ల వాటి కొనుగోలు, సబ్సిడీ, వినియోగం తదితర అంశాలపై ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అన్నదాతలకు వ్యవసాయ పరికరాలు, యంత్రాలను తక్కువ ధరకే కిరాయికి ఇచ్చేందుకు వీలుగా ప్రతీ గ్రామీణ మండలంలోనూ ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 552 గ్రామీణ మండలాలు ఉండగా ఇప్పటికే 131 మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఈ సెంటర్లను ప్రారంభించబోతున్నారు. ఒక్కో కేంద్రానికి గరిష్ఠంగా 30 లక్షల రూపాయలు అవసరం అవుతుండగా... పెట్టుబడి వ్యయంలో 25 శాతం సబ్సిడీగా ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని రుణంగా ఇప్పిస్తారు. మండలంలో ఎక్కువగా సాగు చేసే పంటలను గుర్తించి, అందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తారు. వాటిని ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్న కిరాయి కంటే తక్కువకే రైతులకు ఇవ్వనున్నారు.