హైదరాబాద్‌లో చాలా ఏళ్ల క్రితం ప్రతి మొహర్రం రోజున ముస్లింలు ఊరేగించిన ఆలమ్ అనే పురాతనమైన, విలువైన ఆభరణం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాదాపు 18 ఏళ్ల క్రితం అంటే.. 2003లో ఈ పవిత్రమైన ఆలమ్‌ను హైదరాబాద్‌లో దొంగిలించారు. కొన్నాళ్ల తర్వాత అది ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో కనిపించింది. ఈ విషయం తెలిసి భారత్ ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపగా ఆ ఆలమ్ సహా మొత్తం 14 కళాకృతులను తిరిగి ఇచ్చేందుకు ఆస్ట్రేలియా ఇటీవల అంగీకరించింది.


అసలు ఏంటి ఈ ఆలమ్?
ఆలమ్ అనేది పురాతనమైన ఓ విగ్రహ నిర్మాణం. దాన్ని పంచలోహాలతో తయారు చేసి బంగారు తాపడం చేశారు. అందులో విలువైన రాళ్లు కూడా పొదిగి ఉన్నాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ఆఖరి నిజాం అయిన మిర్ ఉస్మాన్ అలీ ఖాన్.. ఈ ఆలమ్‌ను తయారు చేయించి మహ్మద్ ప్రవక్త కుమార్తె అయిన బీబీ ఫాతిమా జ్ఞాపకార్థం హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్న ఆజా ఖానా జెహ్రా పవిత్ర స్థలంలో ఉంచారు. ఇది 1956లో జరిగింది. చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. తన తల్లి జ్ఞాపకార్థం ఈ స్మారక భవనం ఆజా ఖానా జెహ్రాను నిర్మించారు. అందులోనే ఆయన మహ్మద్ ప్రవక్త కుమార్తె అయిన బీబీ ఫాతిమా మెమోరియల్‌గా పంచలోహాలతో ఈ ఆలమ్‌ను తయారు చేయించి, బంగారు తాపడం చేయించి ఇందులో ఉంచారు.



ఎలా దొంగిలించారు..
పాత బస్తీలో దార్-ఉల్-షిఫా ప్రాంతంలో ఉన్న ఆజా ఖానా జెహ్రా స్మారక స్థలంలో ఉంచిన ఈ ఆలమ్‌ను 2003 ఏప్రిల్‌ 11న గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పంచలోహాలు, బంగారు తాపడం, విలువైన రాళ్లు పొదిగి ఉండడం, అతి పురాతనమైనది కావడంతో ఇది చోరీకి గురైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆజా ఖానా జెహ్రా మ్యూజియం ఉంది. అయితే, ఆ కేసును ఛేదించడంలో అప్పట్లో పోలీసులు విఫలమయ్యారు. తర్వాత ఈ కేసులో ఇద్దరు అనుమానితుల్ని అరెస్టు చేశారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసేశారు. ఆలంతో పాటు దుండగులు మరికొన్ని విలువైన కళాకృతులను కూడా దోచుకెళ్లారు.


మరి ఆస్ట్రేలియా ఎలా చేరింది?
2003లో ఈ పురాతనమైన, విలువైన ఆలంను దొంగిలించిన దుండగులు డబ్బుల కోసం దీన్ని అక్రమమార్గంలో (స్మగ్లింగ్) ఆస్ట్రేలియాకు తరలించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇది నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమైంది. దుండగులు అక్కడి పోలీసులకు దొరికిపోవడంతో ఆ పవిత్ర ఆలంను అక్కడి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా మ్యూజియంలో ఉంచారు. అయితే, ఈ విషయం తెలిసిన భారత్ చాలా సార్లు ఆ విలువైన వస్తువులు తమకు అప్పగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో తాజాగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా సానుకూలంగా స్పందించి వాటిని భారత్‌కు తిరిగి ఇస్తామని ప్రకటించింది. 


ఆజా ఖానా జెహ్రా స్మారక స్థలం ఇప్పుడెలా ఉంది?
ఉస్మానియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మితమైన ఆజా ఖానా జెహ్రా హైదరాబాద్‌లోని దార్-ఉల్-షిఫా ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. క్రీస్తు శకం 680 సంవత్సరంలో కర్బాలా యుద్ధంలో ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ ఇబ్న్ అలీ మరణానికి సంతాపం తెలిపేందుకు మొహర్రం సందర్భంగా ప్రస్తుతం ఈ స్మారక స్థలాన్ని షియా ముస్లింలు ఉపయోగిస్తున్నారు. ఇమామ్ హుస్సేస్ ఇబ్న్ బీబీ ఫాతిమా కుమారుడు. మొహర్రం వేళ ఈ ఆలంను అప్పట్లో ఏటా ఏనుగుపై ఊరేగించేవారు. ప్రస్తుతం ఆజా ఖానా జెహ్రా మ్యూజియం నిజాం ట్రస్ట్ నిర్వహణలో ఉంది. 


హైదరాబాద్‌కు తరలించాలి: వక్ఫ్ బోర్డు సీఈఓ
డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, వక్ఫ్ బోర్డు సీఈఓ అయిన డాక్టర్ సఫీఉల్లా పురాతన ఆలం తిరిగి భారత్‌కు చేరుతున్నందున ఆనందం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అవి భారత్‌కు వచ్చాక, వాటిని హైదరాబాద్‌కు తరలించి ఒరిజినల్ ప్లేస్‌ అయిన ఆజా ఖానా జెహ్రాలోనే తిరిగి ఉంచాలని సఫీఉల్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కోరారు.