DGP Mahender Reddy: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయ వంతం చేయాలని పోలీసు శాఖ కీలక పాత్ర పోషించాలని డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను విజయ వంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ఆయా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని 16వ తేదీన నిర్వహించే జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుంచి అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 


జాతీయ గీతాలాపన


రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీసు కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర దేశాల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని డీజీపీ మహేందర్ సూచించారు. ఇందుకు జిల్లా కలెక్టర్లు, పాలన శాఖల అధికారులతో జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. ట్రాఫక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమి గూడే ప్రదేశాలను గుర్తించి, 11.30 గంటలకు ట్రాఫిక్ నిలిపి వేసి.. అలారం మోగించే విధంగా మైక్ సిస్టమ్స్ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఈ మేరకు సంబంధించిన విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్దాలు లేకుండా, క్రమశిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  జాతీయ గీతాలాపన సమయంలో ఎలాంటి శబ్దాలు లేకుండా, క్రమ శిక్షణతో ఆలపించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 


ఈనెల 22 వరకు ఉత్సవాలు


స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. ఈ నెల 8వ తేదీన హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మువ్వన్నెల రంగులు అలరిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా తీర్చి దిద్దారు. 


వైభవంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు


వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రం ఉచితంగా ప్రదర్శించారు. 552 సినిమా థియేటర్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది ఇళ్లిళ్లు తిరిగి జాతీయ జెండాలు సైతం పంపిణీ చేశారు. ఆగస్టు 15న రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాల్లో జాతీయ జెండాల వితరణ కార్యక్రమం చేపట్టారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫ్రీడం రన్, బుక్ ఫెయిర్, ఫొట ఎగ్జిబిషన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వజ్రోత్సవ కమిటీ తెలిపింది.