Kishan Reddy :   కేంద్రం నుంచి తెలంగాణకు ఎటువంటి సాయం అందడం లేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ప్రకటనలు చేస్తూండటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఈ ఆరోపణల్ని ఖండిచేందుకు ప్రజల ముందు..  తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయట పెట్టారు.   ‘‘రిపోర్టు టూ పీపుల్‌’’ పేరుతో  తెలంగాణ ప్రజల ముందు ఈ వివరాలు వెల్లడించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. 


భారీగా పెరిగిన పన్నుల వాటా 


గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి తన రిపోర్టులో తెలిపారు.  రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం రూ. 1.78 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. రోడ్ల కోసం రూ.1.08 లక్షల కోట్లు, రైల్వేల కోసం రూ. 32,823 కోట్లు కేటాయించిందని చెప్పారు.  2020 నుంచి 2022 కరోనా కాలంలో  ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే తీరుస్తుదన్నారు.  జీఎస్టీ   పరిహారం కింద మొత్తం 15 వేల 329 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు రూ. 9.26 లక్షల కోట్లు వ్యక్తి గత ఋణాలు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. 


తెలంగాణలో అభివృద్ధి సంక్షే్మానికి రూ. 5 లక్షల కోట్లకుపైగా ఖర్చు  


కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో 5 లక్షల 27 వేల కోట్లు ఖర్చు చేసిందని  తన రిపోర్టు ద్వారా కిషన్ రెడ్డి వెల్లడించారు.  తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు రూ.1.35 లక్షల కోట్లు. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్) కింద రూ.983 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సామాజిక మౌలిక సదుపాయాలు కల్పినకు కేంద్రం రూ. 2250 కోట్లు ఇచ్చింది. రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. 


బస్తీ దవాఖానాల డబ్బు కూడా కేంద్రానిదే !


‘‘బస్తీ దవాఖానాల కోసం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.902 కోట్లు. 2014 నుంచి పన్నుల వాటా రూపంలో తెలంగాణకు అందిన మొత్తం రూ.1.60 లక్షల కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు రూ.6,438 కోట్లు. కరోనా టైంలో అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజీ కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.685 కోట్లు. తెలంగాణలో 7.8 కోట్ల కరోనా డోస్‌లు ఉచితంగా కేంద్రం ఇచ్చింది. ఇందుకోసం తెలంగాణకు కేంద్రం ఖర్చు చేసిన నిధులు రూ.1800 కోట్లు ఇచ్చిందని  తెలిపారు. 


భారీగా రైల్వే మౌలిక సదుపాయాలకు నిధులు



ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందేభారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. 2014 తర్వాత తెలంగాణలో 11 సాగునీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజులు ఆలస్యమైంద‌ని చెప్పారు. చివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంత భూమి ఇవ్వాల్సి ఉందని తెలిపారు.