Indira Kranthi Scheme In Telangana: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తుండగా.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించేలా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12న మహిళలకు వడ్డీ లేని రుణాలు 'ఇందిరా క్రాంతి పథకం' (Indira Kranthi Scheme) ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతీ మహిళను మహాలక్ష్మిలానే భావించి గౌరవిస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. 


రైతుబంధుపై కీలక ప్రకటన


ఈ సందర్భంగా రైతుబంధుపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును ఐదు నెలల పాటు ఇచ్చిందని.. తాము వారి కంటే తక్కువ టైంలోనే అందజేస్తున్నట్లు తెలిపారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నామన్న ఆయన.. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని.. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తామని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే వారికే పథకం వర్తింపచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ నెల మొదటి వారంలో జీతాలు అందలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులందరికీ మార్చి 1నే జీతాలు అందించామని అన్నారు.


విద్యుత్ ఛార్జీలపై..


రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని భట్టి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కరెంట్ వినియోగం పెరిగినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో 16 వేల మెగావాట్ల  విద్యుత్ సరఫరాకు కూడా సిద్ధమన్నారు. త్వరలో విద్యుత్ పాలసీ తీసుకొస్తామని అన్నారు. సోలార్ విద్యుత్ ను కూడా ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 'గృహజ్యోతి' కింద అర్హులై ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. ఇప్పటివరకూ 40,33,702 జీరో బిల్లులు జారీ చేసినట్లు వివరించారు. అర్హులై ఉండి 200 యూనిట్ల లోపు వాటి కరెంట్ బిల్ వచ్చినా ఆందోళన చెందాల్సిన పని లేదని.. స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి వివరాలు అందిస్తే అప్ డేట్ చేస్తారని అన్నారు. బిల్ కట్టాల్సిన పని లేదని స్పష్టం చేశారు. గృహజ్యోతి కోసం దరఖాస్తు ప్రక్రియ నిరంతరం అని.. దరఖాస్తు చేసుకోని వారు అప్లై చేసుకోవాలని సూచించారు.


Also Read: Pashamailaram Industrial Area: పటాన్ చెరులో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ