Vijay Durga Productions: సినిమాల ద్వారా వచ్చిన డబ్బును సినీ నటులు రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు రియల్ ఎస్టేట్ రంగంలో, మరికొంత మంది ఫుడ్ బిజినెస్ లో, ఇంకొంత మంది దుస్తులు, కాస్మోటిక్స్ రంగంలో డబ్బులు వెచ్చిస్తున్నారు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు సినిమాల్లో రాణించిన ఆయన ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ దుర్గ ప్రొడ‌క్ష‌న్స్‌ పేరిట సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 


తన తల్లి విజయ దుర్గ పేరిట నిర్మాణ సంస్థ ప్రారంభం


ఈ సినీ నిర్మాణ సంస్థను తనకు ఎంతో ఇష్టమైన అమ్మ విజయ దుర్గ పేరిట ప్రారంభిస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. తన ప్రొడక్షన్ కంపెనీ ద్వారా కొత్త తరం ఆలోచనలు, కొత్త తరం కథనలు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. తన మావయ్యలు చిరంజీవి, నాగబాబు, గురువు పవన్ కల్యాణ్ ఆశీస్సులతో ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు తన కెరీర్‌కు సహకరించిన నిర్మాత దిల్‌ రాజు, బెస్ట్ ఫ్రెండ్స్‌ తో చేసిన ‘సత్య’ సినిమా టీమ్‌ తో తన నిర్మాణ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 






మరోసారి పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్


అటు సాయి ధరమ్ తేజ్ మరోసారి తన పేరును మార్చుకున్నట్లు వెల్లడించారు. ఇకపై తనను సాయి దుర్గ తేజ్ గా పిలవాలని కోరారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తల్లి పేరులోని దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నట్లు చెప్పారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉంటుందనే ఉద్దేశంతోనే పేరును మార్చుకున్నట్లు వెల్లడించారు. నిజానికి 2021లో యాక్సిడెంట్ అయిన తర్వాత న్యూమరాలజీ ప్రకారం ఆయన తన పేరును సాయితేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ పేరును సాయి దుర్గ తేజ్ గా ఛేంజ్ చేసుకున్నారు.


సంపత్ నందితో ‘గాంజా శంకర్’ మూవీ చేస్తున్న సాయి


ఇక ప్రస్తుతం సాయి తేజ్, సంపత్‌ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘గాంజా శంకర్‌’ పేరుతో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్ పవర్ ఫుల్ రోల్ పోషించబోతున్నట్లు సమాచారం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


Read Also: ఆ విషయంలో అస్సలు మొహమాటం లేదు - చిరంజీవి, పవన్ కల్యాణపై సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు!